ఉష్... సైలెన్స్ ప్లీజ్ : వైకాపా నేతల నోటికి తాళం.. ఎందుకో తెలుసా?

గురువారం, 15 అక్టోబరు 2020 (15:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా నేతలకు ఆ పార్టీ అధిష్టానం నుంచి ఓ వాట్సాప్ సందేశం వెళ్లింది. ఏ ఒక్కరూ నోరు మెదపవద్దనీ, సైలెంట్‌గా ఉండాలని కోరారు. దీనికి కారణం లేకలేదు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూత్రి, ఏపీకి చెందిన జస్టిస్ ఎన్వీ రమణపై అనేక ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు జడ్జి బాబ్డేకు లేఖాస్త్రం సంధించారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనమైంది. 
 
ఇలా లేఖ రాయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా, లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ అంశం చివరికి చిలికి చిలికి గాలివానలా తయారవుతోంది. అంటే జగన్ లేఖాస్త్రం చివరకు ఆయన మెడకే చుట్టుకునేలా ఉంది. దీంతో ఈ అంశంపై పార్టీ నేతలెవ్వరూ మాట్లాడొద్దంటూ వైకాపాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో పాటు.. కీలక నేతలకు వాట్సాప్ సందేశాలు వెళ్ళాయి.
 
నిజానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ బాబ్డేకు జగన్ రాసిన లేఖ ఇపుడు జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఏపీ హైకోర్టు జడ్జిలను సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారంటూ లేఖలో జగన్ ఆరోపించారు. దీనికితోడు పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌పై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సీజేఐకు జగన్ రాసిన లేఖపై పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ మాట్లాడవద్దని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అందరికీ వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించారు. ఈ అంశంపై ప్రెస్‌మీట్లు పెట్టడం కానీ, బహిరంగంగా మాట్లాడటం కానీ, పత్రికా ప్రకటనలు విడుదల చేయడం కానీ చేయవద్దని ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు