మహిళ స్వయం సాధికారత దిశగా కీలక అడుగులు: జగన్‌

సోమవారం, 3 ఆగస్టు 2020 (20:04 IST)
అణగారిన వర్గాల వారికి చేయూత నివ్వకుండా, వారి ఆర్థిక అభివృద్ధి దోహదం చేయకుండా మార్పులను తీసుకురాలేమని సీఎం వైయస్ జగన్‌ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల బలోపేతం చేయకుండా ఫలితాలు సాధించలేమన్నారు. అందుకే తమ ప్రభుత్వం మహిళా సాధికారితపై దృష్టిపెట్టిందని, మహిళల జీవితాలను మార్చేలా అనేక కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ స్పష్టం చేశారు.

దీంట్లో భాగంగా ఆగస్టు 12న వైయస్సార్‌ చేయూత ప్రారంభిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత మహిళలకు చేయూతను అందిస్తున్నామని, పారదర్శకంగా, సంతృప్త స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.

ఈ కేటగిరీలో ఉన్న మహిళలు చాలా గురుతర బాధ్యతలను నిర్వరిస్తున్నాప్పటికీ, చాలాకాలంగా నిరాదరణకు గురయ్యారన్నారు. చేయూత కింద ఎంపిక అయిన మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల ఇస్తామని, ప్రతి ఏటా రూ.18750లు ఇస్తామని సీఎం చెప్పారు. 

ఈ సహాయం వారి జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని, స్థిరమైన ఆదాయాలను కల్పించే దిశగా వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే అమూల్‌– ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. ప్రభుత్వం చేయూత నిస్తుందని, బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తుందని, ఈ కంపెనీలన్నీ ముందుకు వచ్చి మహిళలను ఆర్థికంగా చేయూత నిచ్చే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 
 
ఆగస్టు 12న రూ.4500 కోట్లు వైయస్సార్‌ చేయూత పథకం కింద ఇస్తున్నామని, సెప్టెంబరులో వైయస్సార్‌ ఆసరా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దాదాపు 9 లక్షల గ్రూపులకు చెందిన 90లక్షలమంది మహిళలకి ఆసరా అమలు చేస్తున్నామని తెలిపారు.

చేయూత పథకం అందుకుంటున్న మహిళల్లో చాలామందికి ఆసరాకూడా వర్తిస్తుందన్నారు. ఏటా దాదాపు రూ.6700 కోట్లు ఆసరా కింద ఏటా ఇస్తున్నామన్నారు. ఇలా ఈ రెండు పథకాలకు ఏటా రూ.11వేల కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఈ కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నామని తెలిపారు. 
 
ఈ సహాయం.. వారికి స్థిరమైన ఆదాయాలు ఇచ్చేదిగా, స్థిరమైన ఉపాధి కల్పించేదిగా ఉండాలని సీఎం అన్నారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మహిళల జీవితాలను మారుస్తుందని, సమాజంలో అణగారిన వర్గాల్లోని మహిళల జీవితాల్లో వెలుగును నింపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇలాంటి మహిళలు వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలిగేలా కంపెనీలు సహకారం అందించాలన్నారు. అనంతరం ఆయా కంపెనీల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు