తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ ఆలయాల్లో నవంబరు 4వ తేదీన దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు.
ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవోలు పార్వతి, రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కామరాజు పాల్గొన్నారు.