హీరోయిన్‌ను చేస్తామని తీసుకొచ్చి.. వ్యభిచారకూపంలోకి దించారు!

శుక్రవారం, 31 జులై 2015 (12:09 IST)
హైదరాబాద్‌‍ నగరం వివిధ రకాల నేరాలకు అడ్డాగా మారిపోతోంది. తాజాగా ఓ యువతిని హీరోయిన్ చేస్తామని తీసుకొచ్చి.. వ్యభిచారకూపంలోకి దించిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆ యువతి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినది కాగా... మోసం చేసిన వారు.. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వాసులు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్‌, ఫిల్మ్ నగర్‌కు చెందిన హనుమాన్ నాయక్, లక్ష్మణ్ అనే యువకులు తాము దర్శక నిర్మాతలమని ప్రచారం చేసుకుని నెల రోజుల క్రితం కోల్‌కతాకు చెందిన మోడల్‌ను సంప్రదించారు. తాము తీయబోయే చిత్రంలో అవకాశం ఇస్తామని చెప్పి నగరానికి తీసుకొచ్చారు. ఆమెను ఫిలింనగర్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంచారు. 
 
ఆ తర్వాత సినిమా తీస్తున్నామని నమ్మించేందుకు కొన్ని దృశ్యాలను వీడియో కెమెరాతో చిత్రీకరించారు కూడా. ఆమె ఫోటోలు తీసి వాట్స్‌యాప్‌లో పెట్టి, రేటు కట్టిన వీరిద్దరూ ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించడం ప్రారంభించారు. వాట్స్‌యాప్‌లో ఫోటోలు గమనించిన పశ్చిమ మండలం పోలీసులు రంగంలోకి దిగి చాకచక్యంగా నిందితులను, బాధిత యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ యువతిని రెస్క్యూ హోంకు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి