కృష్ణాజిల్లా పాఠశాలలో కరోనా కలకలం.. ఐదుగురు విద్యార్థులకు కోవిడ్

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (18:27 IST)
కృష్ణాజిల్లా పాఠశాలలో కరోనా కలకలం రేపింది. కృష్ణాజిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు, సైన్స్ అసిస్టెంట్‌‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా  నిర్ధారణ అయింది. బాధిత విద్యార్ధులందరూ మండల కేంద్రమైన ముసునూరుకు చెందినవారు. 
 
కరోనా బాధితులకు ప్రభుత్వ వైద్యులు చికిత్సనందిస్తున్నారు. మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో  పెట్టి చికిత్స చేస్తున్నారు. ఇక స్కూల్ మొత్తం శానిటైజ్ చేసి.. మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహిస్తామని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. 
 
అంతేకాదు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. తల్లిదండ్రులు మాత్రం విద్యార్థులను స్కూలుకు పంపేందుకు సంకోచిస్తున్నారు.
 
పలు పాఠశాలల్లో కరోనా సోకడంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఏదైనా స్కూల్లో ఒకేరోజు ఐదుగురికి మించి విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఆ స్కూల్‌ను మూసేయాలని స్పష్టం చేసింది. మిగిలిన విద్యార్థులకు 14 రోజుల క్వారంటైన్ పూర్తైన తర్వాత మాత్రమే క్లాసులు నిర్వహించాలని సూచించింది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు