కాశ్మీర్‌లో విద్యార్ధుల అవస్థలు: స్పందించిన తెలంగాణ సర్కారు

శనివారం, 3 ఆగస్టు 2019 (17:16 IST)
జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు వెంటనే స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందిగా అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు శ్రీనగర్‌లోని నిట్‌ విద్యా సంస్థను మూసివేసింది. 
 
దీంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమకు సాయం చేయాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను ట్వీట్టర్‌ ద్వారా కోరారు. 
 
దీనిపై స్పందించిన ఆయన మీరంతా స్వస్థలాలకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామంటూ ట్వీట్ ద్వారా రిప్లై ఇచ్చారు. ఈ పరిస్థితిపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ వేదాంతం గిరి సమీక్షిస్తున్నారు.
 
నిట్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్ధులను శ్రీనగర్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వారిని ఢిల్లీకి తీసుకురావాలని సీఎస్ ఎస్కే జోషి ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీ నుంచి వీరిని నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు