రాజ్యసభలో కేవీపీ ప్రత్యేక హోదాపై ప్రసంగం... సభలో కుర్చీలు ఖాళీ!

సోమవారం, 2 మార్చి 2015 (16:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావును కోరారు. గత యూపీఏ ప్రభుత్వ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఎక్కడా కూడా ప్రస్తావించలేదని ఆయన గుర్తు చేశారు. 
 
విభజన చట్టం ఆమోదం సమయంలో విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రభుత్వానికి అధికారంలోకి వస్తే అన్ని సమకూర్చుతామని బీజేపీ హామీ ఇచ్చిందని, ఇపుడు ఆ విషయాన్ని మరచిపోయిందని చెప్పారు. ఇపుడు విచిత్రమేమిటంటే... ఏపీ శాసనమండలిలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొంటూ ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం సభలో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
 
ఏపీ ప్రజలు కోరుకునేది పదవులు కాదనీ, ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులు అని చెప్పారు. అందువల్ల విభజన చట్టం మేరకు ఏపీకి సమకూర్చాలని కోరారు. అంతేకాకుండా, గతంలో తమ పార్టీ చేసిన తప్పు వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమై పోయిందని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. కేవీపీ ప్రసంగించే సమయంలో రాజ్యసభలో కుర్చీలన్నీ ఖాళీగా ఉండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి