ఉదయం 6 గం.లకు శ్రీ అమ్మవారి ప్రధాన ఉత్సవమూర్తులను మహామండపము 6వ అంతస్తుకు తీసుకువచ్చి స్థాపన చేశారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యములో కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు దంపతులు ప్రధమముగా విఘ్నేశ్వర పూజ చేసి, ఋత్విక్ వరుణ ఇచ్చి మాలాధారణ కార్యక్రమమును ప్రారంభం చేశారు.
భవానీ భక్తుల సౌకర్యార్థము దేవస్థానము వారు అన్నదానము నందు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమము నందు ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చక సిబ్బంది, ఫెస్టివల్ విభాగము సహాయ కార్యనిర్వహణాధికారి వారు మరియు సిబ్బంది, పలు ప్రాంతములకు చెందిన గురుభవానీలు, వందలాది భవానీ మాల దీక్ష స్వీకరించు భక్తులు పాల్గొన్నారు.
శ్రీ అమ్మవారి భవానీ మండల దీక్షా స్వీకరణ కార్యక్రమము కార్తీక శుద్ధ ఏకాదశి ది.08-11-2019 నుండి కార్తీక పౌర్ణమి ది.12-11-2019 వరకు ఐదు రోజుల పాటు జరుగునని ఆలయ స్థానాచార్యుల వారు ఒక ప్రకటన తెలిపినారు. అలాగే అర్థ మండల(21 రోజులు) దీక్ష స్వీకరణ కార్యక్రమము ఈనెల 28-11-2019 నుండి 01-12-2019 వరకు జరుగునని తెలిపారు.
అనంతరం గిరిప్రదక్షిణ, దీక్ష విరమణ, చండీయాగం డిసెంబర్ 18వ తారీకు నుండి 22 వరకు జరుగునని, ది.22-12-2019 మార్గశిర బహుళ ఏకాదశి రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమము జరుగునని తెలిపారు.