ఆంధ్రప్రదేశ్‌‌లో తాగుబోతులు తగ్గిపోతున్నారు, నిజం గురూ...

శనివారం, 2 నవంబరు 2019 (17:56 IST)
మద్య నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అక్టోబరు నెలలో గణనీయంగా మద్యం విక్రయాలు, వినియోగం తగ్గు ముఖం పట్టాయి.

అంతేకాక ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండడంతో నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. పర్మిట్‌ రూమ్‌లను రద్దుచేయడంతో ప్రతి మద్యం షాపును బార్‌లా నడిపిన గతానికి భిన్నంగా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అందించిన  తాజా వివరాలు ప్రకారం 2018 అక్టోబరులో 32,28,366 కేసులు లిక్కర్‌ను విక్రయించగా, 2019 అక్టోబరులో మాత్రం 23,60,089 కేసులు మాత్రమే అమ్మారు.

గతేడాది అక్టోబరు నెలతో పోల్చుకుంటే ఈఏడాది అక్టోబరు నెలలో మద్యం విక్రయాలు 27 శాతం తగ్గాయి. అదే బీరు అమ్మకాలు చూసుకుంటే  2018 అక్టోబరులో 23,86,397 కేసులు అమ్మడుకాగా, ఈ ఏడాది అక్టోబరులో 10,40,539 కేసులు మాత్రమే విక్రయించారు. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 56.4 శాతం తక్కువగా బీర్లు అమ్మకాలు జరిగాయి. 
 
ఈ ఏడాది కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి రాష్టంలో ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను 4380 నుంచి 3500కు తగ్గించడమే కాకుండా, మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడంతో విక్రయాలు బాగా తగ్గాయి. మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ పరిమితం చేయడం అమ్మకాలు తగ్గడానికి మరో కారణం.

కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో ఉల్లంఘనలకు చెక్‌ పెట్టినట్లయింది. గతంలో టెండర్ల పద్ధతిలో మద్యం దుకాణాలను చేజిక్కించుకున్న ప్రయివేటు వ్యక్తులు సమయంతో సంబంధం లేకుండా, లాభార్జనే ధ్యేయంగా మద్యం అమ్మకాలను కొనసాగించేవారు.

అంతేకాకుండా పర్మిట్‌ రూమ్‌లతో కొన్నిచోట్ల, పర్మిట్లు లేకుండా మరికొన్నిచోట్ల.. ప్రతి మద్యం దుకాణాన్ని ఒక బార్‌లా నిర్వహించారు. దీనివల్ల ఎక్కడ మద్యం దుకాణం ఉన్నా అటువైపు వెళ్లడానికి సంకోచించాల్సిన పరిస్థితి ఉండేది. తాజా నిర్ణయాల్లో భాగంగా ప్రభుత్వం మొత్తం పర్మిట్‌ రూమ్‌లను రద్దుచేసింది. దీంతో ప్రశాంత పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 
మరోవైపు గ్రామాల్లో కూడా బెల్టుషాపులు కనుమరుగయ్యాయి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాలతో ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామాల్లో నిరంతరం నిఘా పెంచుతున్నారు.

బెల్టుషాపులద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం ఉన్న ప్రదేశాలపై నిఘాను పటిష్టంచేశారు. మద్యం అమ్మకాలు గ్రామాల్లో జరగనీయవద్దంటూ పోలీసులు నేరుగా ఆయా గ్రామంలోని పెద్దలకు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మరో వైపు మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

మద్య నియంత్రణ, నిషేధం దిశగా వేస్తున్న అడుగుల్లో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటులో భాగంగా మహిళా పోలీసులను నియమించడం ద్వారా మద్య నియంత్రణ, నిషేధం దిశగా తీసుకుంటున్న చర్యల అమలుపై ప్రభుత్వం తన సంకల్పాన్ని గట్టిగా చాటింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు