ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం: ప‌వ‌న్‌

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (05:25 IST)
మన జీవితంలో ఎన్నడూ ఊహించని విపత్తుని ఎదుర్కొంటున్నాం... ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచి, మనో ధైర్యాన్ని ఇవ్వాలనే బాధ్యతతో జనసేన నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు.

కరోనా మూలంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రభుత్వం పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొంటున్నాం అని తెలిపారు. ఈ తరుణంలో వీలైనంత మేరకు ప్రజలకు అవసరమైన సాయం చేయడమే ముఖ్యం.. అందుకే సంయమనంతో సున్నితంగా స్పందిస్తున్నాం అన్నారు.

ఆదివారం సాయంత్రం గుంటూరు, కృష్ణా జిల్లాల జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా వ్యాధి మూలంగా తలెత్తిన పరిస్థితులు, లాక్ డౌన్ అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కరోనా విపత్తు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తప్పకుండా ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. అలాగే రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. మన నాయకులు, శ్రేణులు రైతాంగం, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియచేశారు.

అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. ఆటోమొబైల్ రంగం కూడా ఇబ్బందుల్లో ఉంది. ఆ రంగం మీద ఆధారపడ్డ కాకులు ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. చిరు వ్యాపారులు రుణాలు తీసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఈ సమస్యలన్నిటిపై సమగ్ర రీతిలో ప్రభుత్వానికి తెలియచేస్తాం. 
 
మానవత్వం బతికే ఉందని నిరూపిస్తున్నారు...
ప్రపంచం ఎవరూ ఊహించని పరిణామం ఇది. ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయింది. పేద ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. వారికి అండగా ఉంటూ మానవత్వం బతికే ఉందని మన జన సైనికులు తమ సేవా కార్యక్రమాలతో నిరూపిస్తున్నారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చినవారు సైతం పెద్ద మనసుతో సాటివారిని ఆదుకొంటున్నారు.

అందరికీ హృదయపూర్వక అభినందనలు. కష్ట కాలంలో ఆదుకొనే మంచి మనసు మీకు ఉంది. సేవా కార్యక్రమాలు చేస్తున్నవారందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను” అన్నారు.
 
ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు: నాదెండ్ల మనోహర్  
జనసేన రాజకీయ వ్య్వహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. గుంటూరు, విజయవాడ నగరాల్లో రెడ్ జోన్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నరసరావుపేట, పొన్నూరుల్లోనూ రెడ్ జోన్స్ పెట్టారు. కరోనా వ్యాధి తీవ్రతపై ప్రభుత్వం తగిన రీతిలో సత్వరం స్పందించలేదు.

ముఖ్యమంత్రి విధానం కారణం. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోవడంలేదు. ఈ ఆపత్కాలంలో జనసేన నాయకులు, జనసైనికులు చేస్తున్న సేవా కార్యక్రమాలు బాధల్లో ఉన్నవారిని ఆదుకొంటున్నాయి. వారందరికీ ఎప్పటికప్పుడు మన అధ్యక్షుల వారు అభినందనలు తెలియచేస్తున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొంటున్న నిర్ణయాలు ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నియమాలు పాటించాలని పవన్ కళ్యాణ్ ముందు నుంచీ బలంగా చెబుతున్నారు. సేవ‌లో పాలుపంచుకొంటున్న జన సేన నాయకులు, శ్రేణులు స్వీయ ఆరోగ్య రక్షణ చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అన్నారు.  టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నాయకులు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు.

క్వారంటైన్  కేంద్రాల్లో ఉన్నవారికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడంతోపాటు తగిన ఆహార సదుపాయాలు సమకూర్చని విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, వృద్ధులకు.. అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణం స్పందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరంపై చర్చించారు. 

మైలవరం ప్రాంతంలో మల్లె తోటలు వేసిన రైతులు మార్కెటింగ్ అవకాశం లేక పడుతున్న ఇబ్బందులు, వరి రైతుకు కనీస మద్దతు ధర కూడా దక్కని విషయాన్ని నాయకులు తెలిపారు. పేద ప్రజలకు ఇచ్చే ఆర్థిక సాయం సక్రమంగా అందకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకోవడంతో రోజు కూలీలు, హాకర్లు, ఆటో డ్రైవర్లు త‌దితరులు కాల్ మనీ రాకెట్లో చిక్కుకొంటున్న పరిస్థితిని వివరించారు.

కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ నిత్యావసరాలు, కూరగాయలు లాంటివి ఇచ్చేందుకు అనుమతులు తీసుకున్నా అధికారులు అడ్డుకొంటున్నారని  పవన్ కల్యాణ్‌కు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు