మద్యం విక్రయాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశాలు: బిజెపి
బుధవారం, 6 మే 2020 (20:51 IST)
మద్యం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఇస్తూ నిబంధనలతో కూడిన సడలింపులు మాత్రమే ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని రాజ్యసభ సభ్యులు, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.
75శాతం పైగా మద్యం ధరలు పెంచడం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని, మద్యం విక్రయాల విషయంలో, ఆదాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే అంతిమ నిర్ణయం అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అధికార వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు మద్యం విక్రయాలు కేంద్రం ఆదేశాలతో చేస్తున్నామని అనడాన్ని జీవిఎల్ నరసింహారావు తప్పు పట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం అని విమర్శించారు.
రెండు రోజుల క్రితం మద్యం అమ్మకాలు కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించారని, కేంద్రం ఆదేశాలతో మద్యం విక్రయాలు చేస్తే కేరళలో, తమిళనాడులో ఎందుకు ప్రారంభం కాలేదని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అయిష్టతతోనే సడలింపులతో కూడిన నిర్ణయాధికారం ఇచ్చిందని ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 5 నుంచి 6 వేల కోట్ల ఆదాయం మద్యం విక్రయాలు ద్వారా వస్తోందని, ప్రభుత్వానికి ఆదాయం పోతోందని మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం వల్ల కేంద్ర ప్రభుత్వం అయిష్టతతోనే సడలింపు ఇచ్చిందని జీవిఎల్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే, మద్యం విక్రయాలను పెంచి ఆదాయం రెట్టింపు చేసిన ఘనత చంద్రబాబునాయుడుది, మద్యం విక్రయాల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలది రాజకీయ అవకాశవాదమేనని ప్రజల ప్రయోజనాలపై దృష్టి లేదని విమర్శించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి కారణంగా మద్యం విక్రయాలపై సడలింపులు ఇచ్చింది తప్ప మద్యం విక్రయాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వలనే జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం విక్రయాలు ఆదాయం కోసం మాత్రమే చేస్తోందని అన్నారు.
మద్యం విక్రయంతో వచ్చే డబ్బంతా రాష్ట్ర ఖజానాలోకే వెళ్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గరీబ్ కళ్యాణ్ పేరుతో రూ.1.7 లక్షల కోట్ల నిధులు, కరోనా నియంత్రణ కోసం మరో రూ.30 వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు ఇచ్చి ఆపద సమయంలో అండగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో మద్యం విక్రయాలు చేస్తోందని ఎద్దేవా చేశారు.