తెలుగుదేశం పార్టీ, బీజేపీలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకిపారేశారు. బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచాయని.. దేశం సమస్యల్లో చిక్కుకుపోవడం మినహా మరేమీ లాభాలను పొందలేదని పవన్ ధ్వజమెత్తారు. పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ గొడవలు, రోహిత్ వేముల ఘటన, నోట్ల రద్దు వంటి ఎన్నో సమస్యలు దేశాన్ని పట్టి పీడించాయని చెప్పారు. ప్రత్యేక హోదాపై తానెందుకు రోడ్డెక్కకూడదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని పవన్ ప్రశ్నించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. వారు అనుకున్నది చేస్తున్నారే తప్ప, ప్రజల మనోభావాలను గురించి పట్టించుకోవడం లేదని, ఇదెంతో బాధాకరమని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను మద్దతిచ్చేందుకు ప్రధాన కారణం ఆయనకున్న పరిపాలనా అనుభవం. 2014 ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడే చెప్పాను. వారి పరిపాలనా అనుభవం రాష్ట్రానికి కావాలని. ఇప్పుడాయన ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ప్రయత్నించక పోడవం ఆయన నైతికంగా చేస్తున్న తప్పు. దాన్ని సరిదిద్దుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. మాటిచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
స్పెషల్ స్టేటస్ కాకుండా ప్యాకేజీతో ఏం వస్తుందని ప్రశ్నించారు. రాత్రికి రాత్రికి ప్యాకేజీ ప్రకటన ఎందుకు చేశారు. ప్రత్యేక హోదాపై ఎన్నెన్ని మాటలు మార్చారంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దుతో నష్టమేనని చెబుతూ ఐదు సార్లు మాటలు మార్చారని చెప్పారు. ఇంత అనుభవమున్న మీరే ఇన్నిసార్లు మాటలు మారుస్తుంటే, ప్రత్యేక హోదాపైనా మీరు మాట మార్చారని ఎందుకు అనుకోకూడదో స్పష్టంగా చెప్పాలని అడిగారు.
గతంలో చంద్రబాబునాయుడు 'నోట్ ఫర్ ఓట్' కుంభకోణంలో చిక్కుకున్న వేళ, తననుంచి ఒక్క మాట కూడా రాలేదన్న విమర్శలకు పవన్ సమాధానం ఇచ్చారు. ఆనాడు తాను మాట్లాడకపోవడానికి కారణాన్ని వివరిస్తూ, "అది ఒక్క తెలుగుదేశం పార్టీ చేసుండుంటే, అంతకుముందు అలా ఎవరూ చేయకుండా ఉండుంటే, నేను కచ్చితంగా, బలంగా నిలదీసి వుండేవాడిని. అన్ని పార్టీలూ హార్స్ రైడింగ్ చేస్తాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడలేదు. దాన్ని నేను వెనకేసుకు రావడమనుకోండి, ఇంకేమైనా అనుకోండి... నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి దానికీ గొడవలు పెట్టుకుంటే... ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రాలు మనవి. ప్రభుత్వాలను ఇబ్బంది పెడితే, ప్రజలకు నష్టం కలుగుతుందే తప్ప, పనులు ముందుకు సాగవని చూసీ చూడనట్టు మాట్లాడాను. అది తెలిసో తెలీకో కాదు... తెలిసే" అని పవన్ చెప్పారు.
పనిలో పనిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాటతీరుపై పవన్ ధ్వజమెత్తారు. "వెంకయ్యనాయుడుగారి పదజాలం ఎలా ఉంటుందంటే... స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాలు కాదు. పది సంవత్సరాలు ప్రసాదిస్తామంటారు. ప్రసాదించడానికి మీరేమైనా దేవుళ్లా? దిగొచ్చరా? మీరు అందరిలాంటి మనుషులు కాదా? ప్రత్యేకించి దిగొచ్చారా? ఢిల్లీ రక్షణ కవచాల్లో కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పైనుంచి దిగొచ్చామనుకుంటున్నారా? మేమందరం మీ బానిసలమా? ఏమనుకుంటున్నారు? మేమీ దేశ ప్రజలం. మీ ఇష్టానికి మాట్లాడితే కుదరదు. ఒక రోజు ఒకమాట చెప్పి, మరోరోజు ఇంకో మాట చెబితే ఖాళీగా కూర్చునే వ్యక్తులం కాదు, ప్రజలం కాదు, మనుషులం కాదు" అని పవన్ ఆవేశంగా మాట్లాడారు.
దయచేసి తమ బాధను అర్థం చేసుకోవాలని, నోటికి ఇష్టం వచ్చినట్టు, నాలుకకు మడతే లేనట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 'రామమందిరం అనే గుడి గురించి మాట్లాడతారు గానీ, నాలుగు కోట్ల మంది ప్రజల సమస్యను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఎందుకో తెలియడం లేదని పవన్ వెల్లడించారు.