ఉండవల్లికి చేరుకున్న చంద్రబాబు... దిష్టితీసిన సతీమణి భువనేశ్వరి

బుధవారం, 1 నవంబరు 2023 (09:14 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిలుపై మంగళవారం సాయంత్రం విడుదలైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 53 రోజుల తర్వాత విజయవాడ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రాజమండ్రి నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్.. దాదాపు 14.30 గంటల నిర్వరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. అయితే, గత 53 రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నీరసంగా ఉన్న ఆయన... మరోమారు సుధీర్ఘ ప్రయాణం తర్వాత అలసిపోయారు. 
 
అలాగే, చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకోగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అమరావతి రైతు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. జై చంద్రబాబు.. జైజై చంద్రబాబు, లాంగ్ లివ్ చంద్రన్న అంటూ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ వరకు వినిపించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నివాసానికి రైతులు, మహిళలు భారీ సంఖ్యలో చేరుకోవడం గమనార్హం. 
 
ఇంటికి వచ్చిన చంద్రబాబుకు ఆయన భార్య నారా భువనేశ్వరి దిష్టితీసిన టెంకాయను పగులగొట్టారు. అలాగే, ఉండవల్లి నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టి తీసి అమరావతి మహిళలు నీరాజనాలు పట్టారు. స్వాగత కార్యక్రమాల్లో నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుండగా చంద్రబాబు నాయుడికి దారిపొడవునా కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. అర్థరాత్రి వేళ, తెల్లవారుజామున సైతం వేలసంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు.

వెబ్దునియా పై చదవండి