రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆన్లైన్లోనూ నామినేషన్లు తీసుకోవాలని కోరారు. పంచాయతీ ఎన్నికలపై పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రబలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో గ్రామ వాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించవద్దన్నారు. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని తెలిపారు.
అన్ని స్థానాలకూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు, సీఎంకు ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం.. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని ఉద్ఘాటించారు. ఈసీని నియంత్రించేందుకు సీఎం ఎవరని నిలదీశారు.
'ఎన్నికలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి తనవాళ్లతో ప్రకటనలు ఇప్పించడం ఏమిటి..? ఎలక్షన్ కోడ్ అమలుతో స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు సీఎం ఇంటికే పరిమితం కావాలి. ఎన్నికల ప్రక్రియలో పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలి ' అని డిమాండ్ చేశారు.