వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు నగరంలోని రాణీనగర్ కు చెందిన యువకుడు కుమార్ రాజా.. నగరానికే చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఇష్టపడ్డారు. దీంతో కుమార్ రాజా.. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పాడు. వారు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతి.. కుమార్ రాజాతో కలిసి బైక్ ఎక్కింది. వారితో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు.
నలుగురు కలిసి ఎలూరు నుంచి ద్వారకా తిరుమల ఆలయానికి వెళ్లారు. ఐతే అక్కడే నెలకొంది అసలు ట్విస్ట్. పెళ్లి కోసం పూలదండలు, తాళిబొట్టు, ఇతరత్రా సామాగ్రి కొనుగోలు చేస్తుండగా సడగ్ యువతి అక్కడి నుంచి మాయమైంది. నేరుగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కుమార్ రాజా అతని స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద్వారకా తిరుమల ఆలయానికి వెళ్లేవరకు పెళ్లి చేసుకోవడానికే తీసుకెళ్లినట్లు తనకు తెలియదని విద్యార్థిని చెప్పినట్లు తెలుస్తోంది. తనను బలవంతంగా పెళ్లి చేసుకోబోయారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
పోలీసులు కుమార్ రాజాతో పాటు అతడి స్నేహితులు దుద్దే ప్రశాంత్ కుమార్, కవులూరి నాగాచారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మైనర్ కావడంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.