మనసులో సంకల్పం, ఏదైనా చేయాలనే కసి, పట్టుదల ఉంటే ఎలాంటి పనికైనా అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకాదని ఒక దివ్యాంగుడు మచిలీపట్నం లోనూ నిరూపించాడు. భగవంతుడు ఇచ్చిన మానవ జీవితాన్ని సార్థకత చేసుకునేందుకు అంగవై కల్యానికి కాదేది అనర్హం అంటూ తన వైకల్యాన్ని జయించి స్వయం ఉపాధి పొందుతూ పలువురు యువతకు ఆదర్శంగా నిలిచాడు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన మామిడి నారాయణకు చిన్నప్పుడే పోలియో వ్యాధి సోకింది. దీంతో ఎడమ కాలు పూర్తిగా చచ్చుపడిపోయింది. తోటి స్నేహితులతో ఆట పాటలలో పాల్గొన లేక తాను ఎంతో కుంగిపోయానన్నారు. అయినా మొక్క వోని ధైర్యంతో హైస్కూల్ చదువును పూర్తి చేశాడు. తల్లి దండ్రులు నిరుపేదలు కావడం.. ఉపాధి లేక మిగతా యువత వల్లే నిరాశ చెందలేదు నారాయణ. తన అంగవైకల్యంతోడు నిరుద్యోగం వల్ల తన తల్లిదండ్రులకు భారంకాకుండా ఉండాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు.
ఉదయాన్నే అల్పాహారం పేద మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకు అందించే వ్యాపారం చేస్తే బాగుంటుందేమోనని నారాయణ యోచించాడు. చిరువ్యాపారులకు వారి దుకాణాల వద్దకే వివిధ రకాల టిఫిన్లు అందిస్తే, ఉపాధి ఎంతో కొంత మెరుగవుతుందని విశ్వసించాడు. బందరు శివారు ప్రాంతాల నుంచి స్థానిక మత్స్య మార్కెట్‌కు ఉదయాన్నే వచ్చి చేపలను అమ్ముకొనే కొందరికి బుట్టలలో గారే ఇడ్లీ బజ్జీ ఉప్మాలు, ఫ్లాస్కులలో కాఫీ టీలను మోపెడ్‌పై అమర్చుకొని తాను ఎంపిక చేసుకొన్నా ప్రాంతాలలో తిరుగుతూ విక్రయించడం ప్రారంభించాడు. చిరు వ్యాపారుల ఆదరణ ప్రోత్సాహం వలనే తాను ఈ చిరు వ్యాపారంలో రాణిస్తున్నట్లు పేర్కొంటూ, ప్రస్తుతం తన ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలిగిపోవడంతోపాటు సమాజంలో గౌరవంగా జీవించగలుగుతున్నట్లు మామిడి నారాయణ వినయంగా పేర్కొంటున్నారు.