ప్రజలు ఇచ్చే లంచాలతోనే మంత్రులకు సౌకర్యాలు : మడకసిర తాహసీల్దార్ వీడియో వైరల్

సోమవారం, 25 డిశెంబరు 2023 (10:20 IST)
రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు తమ ప్రాంతాల పర్యటనకు వచ్చినపుడు వారికి ఏర్పాట్లతో పాటు సకల సౌకర్యాలను ప్రజలిచ్చే లంచాలతోనే సమకూర్చుతున్నామని శ్రీ సత్యనాయి జిల్లా మడకశిర తాహసీల్దారు ముర్దావలీ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ రైతుతో మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మడకశిర మండలం మెళవాయి గ్రామ పరిధి సర్వే నంబరు 441-1లో అదే ఊరికి చెందిన రైతు విశ్వనాథ్ గుప్తాకు 90 సెంట్ల భూమి ఉంది. అందులో 17 సెంట్లను పక్క పొలం రైతుకు ఓ రెవెన్యూ అధికారి లంచం తీసుకుని, రాసిచ్చాడని రైతు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో దానిని సరిచేసి తన భూమి తనకు చెందేలా తహసీల్దార్ ముర్షావలి చేసి న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం గత ఆరు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో రైతు శనివారం తహసీల్దార్ ముర్షావలి చాంబర్‌లోకి వెళ్లి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో తహసీల్దార్ ముర్షావలి రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చినపుడు మేం ఖర్చులు భరించాల్సి వస్తోంది. మడకశిరకు ఆరు నెలల క్రితం ఓ మంత్రి వచ్చినప్పుడు రూ.1.70 లక్షలు ఖర్చయింది. ఆ మొత్తం నలుగురు వీఆర్వోలు భరించారు. 
 
ఇటీవల కేంద్ర జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మడకశిర వచ్చినపుడు అన్ని ఖర్చులూ తామే భరించామన్నారు. ఆ సెక్రటరీ మెనూలో బిర్యానీలు, స్టార్టర్లు, ఐస్క్రీంలు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు పాన్ దోస కూడా ఉందని తన ఫోనులోని జాబితా చూపారు. పాన్ దోస బెంగళూరు నుంచి తెప్పించాల్సి వచ్చిందని వాపోయారు. ఈ ఖర్చులన్నీ తమ జీతాల నుంచి ఇచ్చుకోవాలా అంటూ మండిపడ్డారు. ఇన్ని ఖర్చులు భరించుకోవాలి కాబట్టే లంచాలు తీసుకుంటున్నామంటూ రైతుకు తహసీల్దార్ వివరించారు. ఈ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తీవ్రంగా స్పందించారు. తహసీల్దారు ముర్షావలిని సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు