ప్రాథమిక విద్యను బోధించడం లేదన్న కుంటిసాకుతో మహారాష్ట్ర ప్రభుత్వం మదర్సాలను రద్దు చేస్తే సహించే ప్రసక్తే లేదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీసీ హెచ్చరించారు. మహారాష్ట్రలో మదర్సాలపై నిషేధం విధించాలన్న ఆలోచనలేపై ఆయన శుక్రవారం స్పందించారు.
మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేసిన ఆయన ఆ స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు ఎక్కడ చదువుకోవాలో వారి తల్లిదండ్రులే నిర్ణయించుకుంటారన్నారు. అలాకాకుండా ప్రభుత్వాలు నిర్ణయించడం సమంజసం కాదని హితవుపలికారు. మదర్సాలను నిర్వహించుకోవచ్చని రాజ్యాంగంలోని పలు సెక్షన్లు చెబుతున్నాయని, మైనారిటీల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాయాలని చూస్తే సహించేది లేదని అసదుద్దీన్ తెలిపారు.
కాగా, మహారాష్ట్రలో అధికారిక లెక్కల ప్రకారం 1,889 మదర్సాలు ఉండగా, వాటిలో 1.48 లక్షల మందికి పైగా చిన్నారులు ఉన్నారు. మదర్సాలలో ఇంగ్లీషు, గణితం, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టుల బోధన తప్పనిసరి చేయాలని 'మహా' సర్కారు కిందటి నెలలో నిర్ణయించింది. ఆ సబ్జెక్టులు బోధించని మదర్సాలను పాఠశాలలుగా పేర్కొనలేమని, వాటిలో ప్రాథమిక విద్యను బోధిస్తున్నట్టు కనిపించడంలేదని తెలిపింది. ఈ క్రమంలో జులై 4న రాష్ట్రంలో ఉన్న అన్ని మదర్సాలను పరిశీలించాలని నిర్ణయించింది.