సభ్యసమాజం తలదించుకునే చర్య. మానవ సంబంధాలకు మాయని మచ్చ. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ చర్యను తీవ్రంగా ఖండించాల్సిన భర్త.. నీకు మామే కదా.. సర్దుకుపోవే.. ఆయన చెప్పినట్టు నడుచుకో అంటూ సమర్థించాడు. దీంతో ఆ మహిళ ఏం చేయాలో దిక్కుతోచక... పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణం విజయవాడలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
విజయవాడ, కృష్ణలంకలో నివసించే ఒక మహిళ (32)కు సూర్యారావుపేట బోయపాటి వారి వీధికి చెందిన లక్ష్మీశ్రీనివాస్ (40) అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భర్త శ్రీనివాస్ అనుమానంతో వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. భర్త వేధింపులకు మామ ప్రసాద్ కూడా తోడయ్యాడు. దీంతో ఆ వివాహిత మానసికంగా కుంగిపోయింది.
ఈక్రమంలో మూడేళ్ల క్రితం అత్త మృతి చెందడంతో మామ ప్రసాద్ కోడలిపై కన్నేసి ఆమెను లొంగ దీసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ, ఆమె అతని ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది. అయితే, గత ఏడాది నవంబర్ మొదటి వారంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న కోడలిపై మామ అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పగా అతను కూడా తన తండ్రి చెప్పినట్లు వినాలని, సర్దుకుపోవాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో ఆమె పిల్లలతో పుట్టింటికి చేరింది.