భార్యాభర్తలిద్దరూ మనస్పర్ధలతో గొడవకు దిగి.. పిల్లలను అనాధగా చేశారు. చీటికి మాటికి చిన్నచిన్న గొడవలు పడే ఆ జంట చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ముందు భార్య ఆత్మహత్య చేసుకుంటే.. భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చివరికి పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందిన కె.నాగరాజుకు కందకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన వీణాకుమారికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఉపాధి నిమిత్తం కుటుంబంతో పాటు హైదరాబాద్ వచ్చిన నాగరాజు.. హఫీజ్‌పేటలో నివసిస్తూ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండటంతో కలత చెందిన వీణాకుమారి గత నెల 28న ఆత్మహత్య చేసుకుంది.
ఇక ఆమె అంత్యక్రియల కోసం స్వగ్రామం వచ్చిన నాగరాజు.. భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తాను చనిపోతే ఇద్దరు బిడ్డలు బిడ్డలు అనాథలు అవుతారనుకున్నాడు. అంతకంటే ముందే వారిని చంపేయాలనుకున్నాడు. శనివారం రాత్రి కారులో పిల్లలను తీసుకుని కందుకూరు మండలంలోని పలుకూరు వద్ద కారును ఆపాడు. ఆపై పురుగుల మందు తాగాడు. ఆపై పిల్లలను చంపేందుకు టవల్‌తో వారి గొంతులకు వేసి లాగాడు. వారు భయపడి కారులో నుంచి కిందకు దిగారు.
కొంచెం సేపటి తర్వాత తండ్రి దగ్గరకు వెళ్లగా... ఆయన నిద్రిస్తూ ఉండటంతో కారులోకి ఎక్కి నిద్రించారు. ఆదివారం ఉదయాన్నే నిద్ర లేచిన చిన్నారులు తండ్రిని ఎంత పిలిచినా లేవకపోవడంతో భయపడుతూ రోడ్డుమీదకు వచ్చారు. ఆ సమయంలో అటుగా వచ్చిన గ్రామస్తులు బంధువులకు విషయం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.