ఒకవైపు పర్యావరణ కాలుష్యాలు ఎక్కువవుతున్నాయంటూ... ప్లాస్టిక్ నిషేధమంటూ... నినదిస్తుంటే అప్పుడెప్పుడో గత జూలై నెలలో హరిత ట్రిబ్యునల్ చైనీస్ మాంజా కారణంగా మనుషులతోపాటు పక్షులు, జంతువులు కూడా గాయపడుతున్నారని పేర్కొంటూ నిషేధించిన అదే మాంజా కారణంగా ఒక వైద్యురాలి ప్రాణాలు కోల్పోయింది. సరదాగా గాలి పటాన్ని ఎగరేసేందుకు వాడే మాంజా ఒక నిండు ప్రాణాన్ని గాలిలో కలిపేసిన ఈ ఘటన నాసిక్ ఫటా ఫ్లైఓవర్ మీద చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళ్తే, పింపుల్ సౌదగర్‌లో నివాసం ఉండే ఆయుర్వేద వైద్యురాలు కృపాలి నికమ్ తన స్కూటర్‌పై పుణే నుంచి భోసారి వెళ్తుండగా.. మాంజా కారణంగా ఆమె గొంతు కోసుకుపోయింది. ‘మాంజాను లాగేయడానికి ఆమె విఫలయత్నం చేసినప్పటికీ తీవ్ర రక్తస్రావం కావడంతో స్కూటర్ మీద నుండి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్న ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్న నికమ్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు తెలిపారు.