హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు తన భర్తకు పంపిన మొబైల్ సందేశం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 'ఎండింగ్ మై లైఫ్. నాట్ హ్యాపీ విత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఐ యామ్ నాట్ లైవ్' అంటూ మెస్సేజ్ పంపింది. దీనిపై పోలీసులు ఇపుడు ఆరా తీస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
గతేడాది ఏప్రిల్ 20న సుదర్శన్ నగర్ కాలనీకి చెందిన గిరీష్ నరసింహంతో కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ పద్మజకు వివాహమైంది. ఎంబీఏ పూర్తిచేసిన పద్మజ 11 ఏళ్లుగా మాదాపూర్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. భర్త నరసింహం గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో భారీ కట్నకానుకలే ఇచ్చారు. ఉద్యోగం చేస్తున్న కోడలు ఇంట్లో ఉంటే చాలంటూ ఆనాడు గారాలు పోయిన అత్తింటి వాళ్లు క్రమేణా అదనపు కట్నం కోసం పద్మజపై ఒత్తిడి పెంచారు.
వివాహ సమయంలో ఎకరం పొలంతో పాటు మరో 14 తులాల బంగారాన్ని ఇస్తామని ఇవ్వనందుకే పెళ్లైన నాటి నుంచి అత్త, మరిదితో పాటు భర్త శారీరకంగా మానసికంగా కట్నం కోసం వేధించినట్టు సమాచారం. ఈ క్రమంలో శని, ఆదివారం భార్యభర్తలు గొడవపడినట్లు సమాచారం. ఈ గొడవ తారాస్థాయికి చేరినట్లు తెలిసింది. దీంతో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో పద్మజ భర్త గిరీష్ ఫోన్‌కు 'ఎండింగ్ మై లైఫ్. నాట్ హ్యాపీ విత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఐ యామ్ నాట్ లైవ్' అంటూ మెస్సేజ్ పంపింది. మెసేజ్‌ను చూసి ఇంటికి వచ్చిన నరసింహం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్న భార్యను చూశాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందిందని నిర్ధారించినట్లు భర్త పోలీసులకు తెలిపాడు.
కాగా, మృతురాలి నుదురు, మెడపై గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ గాయాలతోనే ఆమె మృతిచెందిందా? అంతకుముందే భార్యభర్తల మధ్య గొడవ ఘర్షణకు దారి తీసిందా? మృతి చెందిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించి ఆస్పత్రికి తీసుకువెళ్లారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మృతురాలి బంధువులు మాత్రం ముమ్మాటికి హత్యే అని చెబుతున్నారు.