మెహంది పెట్టుకున్నారు.. చిక్కుల్లో పడిన బీఈడీ విద్యార్థినిలు... ఎందుకో తెలుసా?

సోమవారం, 11 జులై 2016 (09:01 IST)
పండుగ అంటేనే యువతులు తమ చేతులకి మరింత అందంగా మల్చుకోవడానికి మెహింది పెట్టుకుంటారు. కానీ ఆ మెహింది కొందరి విద్యార్థినులను చిక్కుల్లో పడేసింది. అసలు విషయం ఏంటంటే... ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 9 నుంచి ప్రారంభమైన బీఈడీ సోషల్ స్టడీస్‌లో ప్రవేశానికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు నగరంలోని ఏపీ కాలేజీలో కౌన్సెలింగ్ జరిగింది. 
 
కౌన్సెలింగ్‌కు హాజరైన కొందరు విద్యార్థినుల చేతికి ఉన్న మెహింది వలన బయోమెట్రిక్ యంత్రం వారి చేతి గుర్తులను స్వీకరించలేదు. దీంతో అధికారులు చేతులెత్తేశారు. కానీ విద్యార్థుల వినతి మేరకు మరొకరోజు అవకాశం కల్పించారు. ఆదివారం (10న) హాజరైన విద్యార్థుల చేతులు గోరింటాకు కారణంగా ఎర్రబడటంతో బయోమెట్రిక్ యంత్రం చేతి గుర్తులను స్వీకరించలేదు. 
 
బీఈడీ సోషల్ స్టడీస్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సోమవారంతో (11న) ముగియనున్నందున విద్యార్థినుల ఫోటోల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎడ్‌సెట్-2016 ప్రవేశ పరీక్ష నాటికి వారి చేతులు మాములుగా ఉండడం వలన బయోమెట్రిక్ యంత్రంతో అప్పుడు సమస్య తలెత్తలేదు. కేవలం మెహింది చేతులకు పెట్టుకోవడం వలనే సమస్య వచ్చిందని ఎడ్‌సెట్ అధికారులు పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన ఈ సమస్యపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి