అక్క కోసం కవల పిల్లలను చంపేసిన మేనమామ... ఎక్కడ?

శనివారం, 16 జూన్ 2018 (08:36 IST)
వారిద్దరూ కవల పిల్లలు. పుట్టుకతోనే మానసిక వికలాంగులు. ఆ కన్నబిడ్డలను మామూలు బిడ్డలుగా చేసుకునేందుకు ఆ కన్నతల్లి పడరాని పాట్లుపడుతోంది. ఆ చిన్నారులను తిప్పని ఆస్పత్రంటూ లేదు. చూపించని వైద్యుడంటూ లేడు. కానీ, వారి మానసిక పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఇలా అక్కపడుతున్న బాధలను ఆ మేనమామ చూడలేకపోయాడు. ఆ బాధల నుంచి అక్కకు విముక్తి కల్పించాలని భావించిన మేనమామ... ఆ ఇద్దరు పిల్లలను గొంతుపిసికి చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి సత్యనారాయణపురంలో అమానవీయ సంఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులను అతి కిరాతంగా హత్య చేశారు. మిర్యాలగూడకు చెందిన లక్ష్మీ, శ్రీనివాస్ రెడ్డి దంపతులకు 12 యేళ్ల వయస్సున్న సృజన రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ పుట్టుకతోనే మానసిక వికలాంగులు. వీరిని మామూలు మనుషులను చేసేందుకు లక్ష్మీ పడరాని పాట్లు పడుతోంది. 
 
దీన్ని గమనించిన ఆమె సోదరుడు ఆ ఇద్దరు పిల్లలను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. పిల్లలకు మాయ మాటలు చెప్పి హైదరాబాద్ తీసుకువచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం వారి మృతదేహాలను కారులో తరలించేందుకు బయటకు తీసుకురాగా, ఇంటి యజమాని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మల్లికార్జున్ రెడ్డి‌తో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 
 
అయితే, ఈ ప్లాన్ వెనుక మల్లికార్జున్ ఒక్కడే ఉన్నాడా..? ఇంకా బంధువులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం వారి మృతదేహాలను పంచనామా కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు