అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు పాత్రను అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కడిగిపారేయడంతో ఇక చంద్రబాబు ఒక క్షణం కూడా పత్తిపాటిని మంత్రిపదవిలో కూర్చోనీయరని వార్తలు పేలుతున్న సమయంలో పత్తిపాటి కంటే ముందే గంటా శ్రీనివాసరావు పదవికే ఎసరు వచ్చేటట్టుందని ఏపీ శాసనమండలి గొల్లుమంది.
రాష్టంలో పాఠశాల విద్యపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల పక్ష నేత బాలసుబ్రహ్మణ్యం గంటా పదవిపై చేసిన వ్యాఖ్య కౌన్సిల్ సభ్యులకు కడుపుబ్బ నవ్వు తెప్పించింది. విషయం ఏమిటంటే.. పాఠశాల విద్యపై అందరి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఎమ్మెల్సీలతో వారం రోజుల్లో ఒక సమావేశం నిర్వహిస్తానని మంత్రి గంటా చెప్పారు.
కానీ మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యా శాఖ నుంచి తప్పించి వేరొక శాఖకు కేటాయించమని సీఎం చంద్రబాబును కోరినట్లు శుక్రవారమే కొన్ని పత్రికల్లో వార్తలొచ్చాయి. పీడీఎఫ్ ఎమ్మెల్సీల పక్ష నాయకుడు బాలసుబ్రమణ్యం సరిగ్గా ఈ అంశాన్నే సభలో ప్రస్తావిస్తూ అసలు వారం రోజుల తర్వాత గంటా మంత్రిగా ఉంటారా అని దీర్ఘాలు తీశారు.