విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నీచ రాజకీయాలు చేస్తున్నారని విజయవాడ నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరంలోని 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ పుట్ట రోడ్డులోని దేవాదాయ శాఖ భూముల్లో నివాసం ఉంటున్న వారిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. ఇక్కడి ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, వారిని ఎవరూ ఖాళీ చేయించలేరని పేర్కొన్నారు.
ప్రజలు టీడీపీ ని ఎప్పుడో మర్చిపోయారు... ఎమ్మెల్యే గద్దె తన గుర్తింపు కోసం అవాస్తవలు ప్రచారం చేస్తున్నారు. అయిదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె, అదే నియోజకవర్గంలో ఉన్న అక్కడ ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని బెల్లం దుర్గ డిమాండు చేశారు. దేవినేని అవినాష్ నియోజకవర్గ ఇంచార్జి గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ని అవినాష్ చేసి చూపించారన్నారు. 15వ డివిజన్ ని దత్తత తీసుకున్నా అని చెప్పిన ఎమ్మెల్యే గద్దె ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేశారు చెప్పాలని డిమాండు చేశారు.
పుట్ట రోడ్డు దేవాదాయ శాఖ భూముల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, టీడీపీ నేతలు సిగ్గు లేని రాజకీయాలు చేస్తున్నారు అని ప్రజలు గ్రహించాలన్నారు. నీచ రాజకీయాలు చేయటం ఇకనైనా మానుకోవాలని కోరుతున్నా అన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ అల్లా చల్లారావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజలను రెచ్చ కొట్టే పనులు చేస్తున్నారని, 15 వ డివిజన్ ని దత్తత తీసుకున్న గద్దె ఆ డివిజన్ కోసం ఏమి చేయలేదన్నారు.
గద్దె రామ్మోహన్ చేసిన అనాలోచిత పనుల వలనే రిటైనింగ్ వాల్ నిర్మించిన రామలింగేశ్వర నగర్ మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దమ్ముంటే గద్దె రాజకీయంగా తమను ఎదుర్కోవాలే కానీ, తప్పుడు ప్రచారం చేయకూడదని అన్నారు.