జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక : కార్పొరేటర్లతో అధినేత మంతనాలు

బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (17:29 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్లను గురువారం ఎన్నికోనున్నారు. దీనికంటే ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లకు ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చూశారు. 
 
మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా రేపు జరగనుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఉండనున్నారు. 
 
కొత్తగా గెలిచిన కార్పొరేటర్లకు,ఎక్స్ అఫిషియో మెంబెర్స్‌కు ఇప్పటికే ఎన్నికల నిర్వహణ అధికారి నుంచి ఆహ్వానం అందింది. బల్దియా ఎన్నికల్లో తెరాస బలం 56 కార్పొరేటర్లు +32 ఎక్స్ ఆఫీషియో మెంబెర్స్ కాగా.. బీజేపీ బలం 47 కార్పొరేటర్లు + 2 ఎక్స్ ఆఫీషియో మెంబెర్స్. ఎం.ఐ.ఎం బలం 44 కార్పొరేటర్లు +10 మంది ఎక్స్ ఆఫీషియో మెంబెర్స్ కాంగ్రెస్‌కు 2 కార్పొరేటర్లు చొప్పున ఉన్నారు. 
 
ఇకపోతే, బీజేపీ కార్యాలయంలో బీజేపీ కార్పోరేటర్లు బుధవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. మేయర్ ఎన్నిక సందర్భంగా వ్యవహంచాల్సిన తీరుపై బీజేపీ కార్పొరేటర్లు చర్చించనున్నారు. గురువారం ఉదయం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని.. అమ్మ ఆశీస్సులు తీసుకున్న తర్వాత మేయర్ ఎన్నికకు బీజేపీ కార్పేరేటర్లు బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీకి మెత్తం 47మంది కార్పోరేటర్లు, ఇద్దరు ఎక్స్ఆఫీషియో సభ్యులు ఉన్నారు. 
 
అదేవిధంగా గురువారం ఉదయం దారుస్సలం ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సమావేశంకానున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం కార్పొరేటర్లు కీలకంగా మారిన విషయం తెలిసిందే. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనాలా.. వద్దా అనే దానిపై ఈ రోజు సాయంత్రం లోపు ఎంఐఎం క్లారిటీ ఇవ్వనుంది. ఒకవేళ మేయర్ ఎన్నికలో బీజేపీ పాల్గొంటే తప్పకుండా తాము కూడా పాల్గొంటామని ఎంఐఎం కార్పొరేటర్లు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు