పేదలకు ఇళ్ళు ఇస్తున్నా.. ప్రతిపక్షాలు శాపనార్థాలా..?: ఎమ్మెల్సీ డొక్కా

ఆదివారం, 27 డిశెంబరు 2020 (06:15 IST)
ప్రపంచ చరిత్రలో కూడు, గుడ్డ, నీడ కోసమే ఉద్యమాలు, విప్లవాలు జరిగాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి గొప్ప విప్లవాత్మక ఆలోచన చేసి రాష్ట్రంలోని పేదవారందరికీ కులం, మతం చూడకుండా ఇళ్లను నిర్మించి ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిచారని, ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన కార్యక్రమమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.

31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమం ప్రపంచ చరిత్రలోనే అరుదైనదిగా డొక్కా అభివర్ణించారు. ఇంతమంది పేదవారికి ఇళ్ల కార్యక్రమం చేపట్టినందుకు సీఎం జగన్ కి డొక్కా ధన్యవాదాలను తెలిపారు. 
 
ఈ ఇళ్ల నిర్మాణమనేది సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి చేపట్టే కార్యక్రమం అని డొక్కా అన్నారు. దీని ద్వారా వివిధ వృత్తుల వారికి, కోట్ల మంది పేదలకు ఉపాధి లభించి పనిదినాలు పెరుగుతాయన్నారు. అంతేకాకుండా జీడీపీ మూడు శాతం పెరుగుతుందన్నారు. వ్యవసాయం తర్వాత ఇళ్ళ నిర్మాణమే  ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందని డొక్కా తెలిపారు. 
 
దేశంలో కరోనా పరిస్థితుల వల్ల అన్ని రంగాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని డొక్కా అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా సంక్షోభంలో ఉన్నప్పటికీ.. ఈ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందటం కోసం ఈ హౌసింగ్‌ నిర్మాణం భారీగా చేయటం గొప్ప విషయమని డొక్కా తెలిపారు. పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలే ఇంత లోతుగాఈ విషయం ఆలోచించగలరని అన్నారు.

దీనివల్ల మూడు శాతం జీడీపీ పెరుగుదల నమోదవుతుందని అన్నారు. ఇది మామూలు విషయం కాదని డొక్కా అన్నారు. ఇల్లు అన్నది కేవలం ఇల్లే కాదు. కొన్న లక్షల మందికి ఉపాధి ఇస్తుంది. దీనివల్ల కొన్ని లక్షల మందికి ఆదాయం వచ్చి, ఆ విధంగా మేలు జరగబోతుంది. ఆ విధంగా కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి దొరకడమే కాకుండా.. తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు అవసరమైన మెటేరియల్‌ చూస్తే..  సిమెంట్, ఐరన్, ఇసుక వంటి ఉత్పత్తుల అమ్మకాలతో పాటు పరోక్షంగా  పనులు చాలా జరుగుతాయని డొక్కా వివరించారు. ఇది సంక్షేమ కార్యక్రమం కాదని రాష్ట్ర ప్రగతి ముఖ చిత్రం మార్చేసే కార్యక్రమన్నారు. 
 
ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అమరావతిలో, రాష్ట్రంలో ఇంత పెద్దఎత్తున పేదలకు ఇళ్లు కేటాయింపులు చేయటాన్ని సహించలేకపోతున్నారు. వారందరికీ పేదల తరుపున విజ్ఞప్తి చేస్తున్నానని, మీరు జీవితంలో ఏనాడైనా పేదల కోసం ఇంత గొప్ప కార్యక్రమం ఆలోచించారా అని డొక్కా ప్రశ్నించారు.

జగన్ చేపట్టిన ఈ ఇళ్ల కార్యక్రమం లాంటిది ఎప్పుడూ ఎవ్వరూ చేపట్టలేదని డొక్కా అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఇంకా ఎక్కువ మందికి మంచి జరిగేలా చూడాలి. కానీ, పేదల నోటిలో మట్టి కొట్టేలా ప్రతిపక్షాలు వ్యవహరించవద్దని డొక్కా సూచించారు. 
 
పట్టణ ప్రాంతంలో సెంటు స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇంటి స్థలం ఇస్తే ప్రతిపక్షాలకు కంటగింపు ఎందుకు అని డొక్కా ప్రశ్నించారు. గతంలో ఏనాడైనా పేదల పక్షాన ఇలాంటి మేలు చేసే కార్యక్రమాన్ని ఏమైనా ఆలోచన చేశారా అని డొక్కా ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు శాపనార్థాలు మానండిని... రాజకీయాల్లో ఇది మంచిది కాదని లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని డొక్కా అన్నారు.

అమరావతిలో 54వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే డెమోగ్రఫిక్‌ ఇం బ్యాలెన్స్ వస్తుందని, అప్పుడు ఎలైట్ సెక్షన్‌ దెబ్బతింటుందని హైకోర్టులో వాదనలు చేసింది మీరుకాదా? దాన్ని నమ్మి కోర్టు స్టే ఇవ్వలేదా? ఎలైట్‌ సెక్షన్ ఉన్న ప్రదేశంలో పేదవారు ఉండకూడదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? లేక రాజరిక వ్యవస్థలో ఉన్నామా అని డొక్కా నిలదీశారు.

అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాలని డొక్కా కోరారు. పేదల పక్షాన మాట్లాడే చిత్తశుద్ధి ఉంటే తక్షణం కోర్టులో ఉన్న కేసులు ఉపసంహరించుకొని, ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి మార్గం సుగమనం చేయాలని డొక్కా సూచించారు.  మీరు అలాంటివి ఆలోచించకుండా పేదలకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా దుర్మార్గం, క్షమార్హం కాదని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నానని డొక్కా అన్నారు. 
 
జగన్ ఈ స్ఫూర్తిని ఆయన తండ్రి వైయస్‌ఆర్‌ నుంచి తీసుకొని ఉంటారని డొక్కా అన్నారు. గతంలో మహానేత వైయస్‌ఆర్‌ గారు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, పెద్దఎత్తున పక్కా ఇళ్ళు కట్టించారు.  భారీస్థాయిలో ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమం దేశంలోనే ఇంతవరకూ జరగలేదని, రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో జరుగుతోందని డొక్కా అన్నారు. ఇది సంక్షేమ కార్యక్రమం కాదని.. ఒక కులం కోసం చేసే కార్యక్రమం కాదని.. ఓసీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు.. ఇలా పేదలు ఎవరైనా నాకు ఇల్లు లేదనే పరిస్థితి ఉండకూడదని జగన్ ఆలోచించారని డొక్కా గుర్తు చేశారు.

ఆ ధైర్యం, తెగువ మీకు ఉందో, లేదో ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.  ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే డెమోగ్రఫిక్‌ ఇం బ్యాలెన్స్‌ అని ఎక్కడైతే వాదనలు చేశారో అక్కడే పిటీషన్ వేసి కేసు విత్‌డ్రా చేసుకొని అమరావతిలో 54వేల ఇళ్ల పట్టాలు ఇప్పించడని డొక్కా అన్నారు.
 
కోర్టుల్లో కేసులు వేసి అమరావతిలో సామాజిక అసమతుల్యత దెబ్బతింటుందని చెప్పి స్టేలు తెచ్చుకొని ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వద్దంటారా? ఇది న్యాయమేనా మీకని ప్రతిపక్షాలపై డొక్కా మండిపడ్డారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో కేసు ఉపసంహరించుకునే పిటీషన్‌  రేపే వేయాలని డొక్కా కోరారు. ఇంత మహాయజ్ఞం చేపడుతుంటే.. ప్రతిపక్షాల తీరు సరికాదని డొక్కా హితవు పలికారు.
 
సంక్షేమంతో పాటు అభివృద్ధిని అందజేస్తూ.. ప్రజల ప్రాధమిక, మౌలిక అవసరాలను ప్రభుత్వం తీరుస్తుందన్నారు. పేదవాడికి ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవం. ఇల్లు ఉంటే సమాజంలో ఒక గౌరవం లభిస్తుందని డొక్కా పేర్కొన్నారు. దీనివల్ల స్థిరమైన జీవితం, స్థిరమైన ఆలోచన, పరువు, ప్రతిష్ఠలు పేదవారికి పెరుగుతాయన్నారు.

పేదవారికి ఇల్లు ఉంటే ఆత్మస్థైర్యం వస్తుందని తద్వారా జీవితంలో మార్పు వస్తుందని డొక్కా అన్నారు. ఇంతకాలం ఇంటి జాగా కోసం, ఇంటి నిర్మాణం కోసమే పేదలు రోడ్ల మీదకు వస్తోంది. అలాంటిది జగన్ పేదలకు ఇళ్ళు ఇస్తామని ముందుకు వస్తే ప్రతిపక్షాలు ఎందుకు స్వాగతించరని డొక్కా ప్రశ్నించారు. 
 
అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన తాము సైతం.. తన చిన్నతనంలో ఇల్లులేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని పూరిగుడిసె ఉన్నా సంతోషించేవారమన్నారు. చెట్ల కింద, పుట్టల కింద బ్రతికే సమాజాన్ని చూశామన్నారు. అలాంటి వర్గాలకు ఈ రోజు స్థిరమైన నివాసం లభిస్తుంటే మాకంటే సంతోషించే వారు ఎవరుంటారని డొక్కా అన్నారు.

అంత గొప్ప కార్యక్రమం చేస్తున్న జగన్ కి ధన్యవాదాలు చెప్పకూడదా? తమ పోరాటాలు పేదల కోసమని వల్లెవేసే కమ్యూనిస్టులు ఈ కార్యక్రమాన్ని ఎందుకు మెచ్చుకోవటం లేదని డొక్కా సూటిగా ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు