జన ఆశీర్వాద యాత్ర సఫలం... ఏపీ బీజేపీకి కొత్త బలం!!
గురువారం, 19 ఆగస్టు 2021 (16:54 IST)
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి కొత్త ఊపు కనిపిస్తోంది. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం నిర్దేశించిన జన ఆశీర్వాద యాత్ర కమల దళానికి కొత్త వికాశాన్ని అందించింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి రెండు రోజుల పర్యటన ఆద్యంతం ఆంధ్రప్రదేశ్ లో ఉత్సాహంగా సాగింది.
అటు తిరుపతి, ఇటు విజయవాడ నగర వీధుల్లో బీజేపీ ర్యాలీలు, సభలతో జన ఆశీర్వాద యాత్ర విజయవంతం అయిందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ సరికొత్త స్థానాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాజకీయంగా అపారమైన చైతన్యం నిండిన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ హవా మొదలయిందని ఆ పార్టీ నాయకత్వం పేర్కొంటోంది.
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన జన ఆశీర్వాద యాత్ర రాష్ట్రంలో కమలనాధుల్లో కొత్త వికాశాన్ని అందించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలిసారిగా 27 మంది బీసీలకు, అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర మంత్రి పదవులను ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలో ఎన్నడూ లేని వినూత్న సమీకరణాలతో ఏర్పడిన కేంద్ర మంత్రి వర్గాన్ని, పార్లమెంటుకు పరిచయం చేయడాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. దీనితో ప్రజల ఆశీర్వాదాన్ని నేరుగా మీరు పొందండని, ప్రధాని మోదీ జన ఆశీర్వాద యాత్రకు శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
తెలుగు రాష్ట్రాలలో జన ఆశీర్వాద యాత్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తో ప్రారంభించారు. ఆయన నమ్ముకున్న తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో తిరుపతిలో ఈ యాత్రకు శ్రీకారం చుట్టి, బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ముగించారు. రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేసిన జన ఆశీర్వాద యాత్రకు మంచి స్పందన లభించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు అందిస్తున్న ఉచిత బియ్యం, ఉచిత వ్యాక్సిన్ లతో పాటు గృహ నిర్మాణం, జాతీయ రహదారి వంటి సౌకర్యాలపై ప్రజల్ని చైతన్యపరచడంతో సత్ఫలితాలుంటాయని భావిస్తున్నారు.
ముఖ్యంగా బీజేపీ మహిళా విభాగం జన ఆశ్వీర్వాద యాత్రలో చురుకుగా పాల్గొంటోందని, ఇది శుభ పరిణామమని పేర్కొంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూనే, బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్వహిస్తున్న జన ఆశీర్వాద యాత్ర తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. పైగా అందరూ మాస్కులు ధరించాలని సభల్లో చెపుతున్నారు. ఇలా అందరూ మాస్కులు ధరిస్తే, కరోనా మూడో వేవ్ రాదంటున్నారు.