మూడు రాజధానులపై మారిన మూడ్.. సెలక్ట్ కమిటీపై అనిశ్చితి... సర్వత్రా ఉత్కంఠ
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:26 IST)
రాజధాని వ్యవహారంపై బ్రేక్ వేద్దామనుకున్న టీడీపీకి రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో షాక్ ఇచ్చింది. సెలక్ట్ కమిటీ వ్యవహారాన్ని తనదైన శైలిలో పక్కన పెట్టేసింది. దీంతో మూడు రాజధానుల వ్యవహారం మళ్లీ మూడ్ లోకి వచ్చింది.
మండలి ఇప్పటికే తిరస్కరించిన సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లుల పరిశీలనకు సెలక్ట్ కమిటీని వేస్తున్నట్లుగా నోటిఫికేషన్‌ను విడుదల చేయాలంటూ శాసనమండలి చైర్మన్ ఎండీ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను, దానిపై ఆయన రాసిన లేఖను మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తిరస్కరించారు.
నిబంధనల ప్రకారం లేనందున, నోటిఫికేషన్ విడుదల చేయడం కుదరదని కరాఖండీగా చెప్పారు. నోట్ ఫైల్‌ను తిప్పిపంపారు. దీంతో చైర్మన్ ఆదేశాలు దాదాపు నిలిచిపోయినట్లయింది. పైపెచ్చు ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతామని చైర్మన్ షరీఫ్ అధికారికంగా చెప్పినా..అది చెల్లుబాటు కాదని అసెంబ్లీ సెక్రటేరియట్ అంటోంది.
చైర్మన్ ఈ ఆదేశాలు జారీ చేసి 14 రోజులు పూర్తయిపోవడమే దీనికి కారణమని, దీనివల్ల రెండు బిల్లులూ పాసైనట్లుగానే భావించాల్సి ఉం టుందని అధికార పక్షం వాదిస్తోంది.
చైర్మన్ ఆదేశాలను బేఖాతరు చేసే అధికారం మండలి కార్యదర్శికి ఉండదని, ఆయన వైఖరి మారకపోతే సభాహక్కుల తీర్మానం ప్రవేశపెడతామని శాసనమండలిలో ఎక్కువమంది సభ్యులు కలిగిన తెలుగుదేశం పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.
దీంతో సెలక్ట్ కమిటీ విషయంలో ఇప్పటివరకూ శాసన మండలి వేదికగా జరుగుతున్న యుద్ధం, మండలి కార్యదర్శి నిర్ణయంతో న్యాయపోరాటానికి దారి తీస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో .. చైర్మన్ ఆదేశాలను అసెంబ్లీ సెక్రటేరియేట్ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
శాసనసభలో వైసీపీకి సంపూర్ణ ఆధిక్యత ఉంది. శాసనమండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను శాసనసభా శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసనసభలో ఈ బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం లభించగా, శాసనమండలిలో చుక్కెదురైంది.
ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా చైర్మన్ షరీఫ్ ప్రకటించి .. సభను నిరవధికంగా వాయిదా వేశారు. చైర్మన్ ఆదేశాల ప్రకారం వైసీపీ మినహా మండలిలోని రాజకీయ పార్టీలు తమ సభ్యుల పేర్లను సెలెక్ట్ కమిటీకి సూచించాయి.
వాటిని పరిగణనలోకి తీసుకొన్న చైర్మన్... రెండు కమిటీల చైర్మన్లుగా మంత్రులు బొత్స, బుగ్గన, ఈ కమిటీల్లో వైసీపీ సభ్యులుగా ఇక్బాల్, వెన్నపూస గోపాలరెడ్డి పేర్లను సిఫారసు చేశారు. ఈ మేరకు సెలెక్ట్ కమిటీలను వేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని మండలి కార్యదర్శికి లేఖ రాశారు.
ఈ లేఖను సోమవారం మండలి కార్యదర్శి తిరస్కరించడంతో ఈ వివాదం మరింత క్లిష్టంగా మారింది. నోట్‌ఫైల్‌పై కార్యదర్శి తన అభిప్రాయాన్ని రాసి తిప్పి పంపిన సమాచారం తెలుగుదేశం ఎమ్మెల్సీలకు తెలిసింది.
హుటా హుటిన బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, బుద్దా నాగ జగదీశ్వరరావు, బచ్చుల అర్జునుడు శాసనమండలికి చేరుకున్నారు. శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులును కలసి .. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించే అధికారం అసెంబ్లీ సెక్రటేరియేట్‌కు లేదని వాదించారు.
చైర్మన్ ఆదేశాలు పాటించనందున .. సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇస్తామని హెచ్చరించారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించానని వారికి బాలకృష్ణమాచార్యులు సమాధానం ఇచ్చారు. తనపై నోటీసును ఇస్తే .. నిబంధనల మేరకు సమాధానం ఉంటుందని స్పష్టం చేశారు.
తన కార్యాలయానికి బుద్దా వెంకన్న తదితరులు వచ్చిన విషయాన్ని మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి పిల్లి సుభాశ్ చంద్రబో్‌సకు బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు.