పశ్చిమగోదావరి జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద నారా లోకేశ్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఉప్పుటేరు కాలువలోకి వెళ్లింది.
అయితే, ఈ సందర్భంగా గుంతలో ట్రాక్టర్ చిక్కుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘బాబూ... చిట్టీ (లోకేశం)! ఇంతకీ నువ్వు ఎక్కిన ట్రాక్టర్ గుంతలో పడిందా... లేక నువ్వు ట్రాక్టర్ ఎక్కడం వల్ల భూమిలో గుంత పడిందా? ప్లీజ్ చెప్పు!’ అని విజయసాయిరెడ్డి చురకలంటించారు.
కాగా, ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ఉండి నియోజకవర్గం, సిద్ధాపురం గ్రామంలోని చాకలి పేటలో ఇళ్లు ఇంకా నీట మునిగే ఉన్నాయి. ఇంట్లో అడుగు మేర పేరుకుపోయిన బురద, బయట చెరువును తలపిస్తోంది. రోడ్లపై ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉందని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.