14న మిస్టర్ ఆంధ్రా రాష్ట్ర స్థాయి బాడీ బిల్డిగ్ పోటీలు

శుక్రవారం, 12 మార్చి 2021 (09:47 IST)
జిగ్లింగ్ ఫిట్నెస్ వరల్డ్ 10వ వార్షికోత్సవం సంద‌ర్భంగా కృష్ణాజిల్లా బాడీ బిల్డింగ్ అసోషియేషన్ నిర్వహణలో ఈ నెల 14న రాష్ట్రస్థాయి మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహిస్తున్న‌ట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మారెళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు.

మొగల్రాజపురంలోని జిగ్లింగ్ ఫిట్‌నెస్ వరల్డ్ నందు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మారేళ్ల వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ఈ నెల 14న ఆదివారం మొగల్రాజ‌పురంలోని సిద్ధార్ద ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాల నుండి 200 మందికి పైగా బాడీ బిల్డర్లు హాజ‌ర‌వుతార‌ని పేర్కొన్నారు. పోటీలు తొమ్మిది కేటగిరిలుగా జరుగుతాయని, అండర్ 55 ఏజ్ నుండి అండర్ 95 వరకు వివిధ‌ వయసుల‌ కేటగిరిలలో పోటీలు జరుగుతాయని తెలిపారు. ప్రతి కేటగిరిలలోనూ నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం అందిస్తామ‌న్నారు.

పోటీలలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర జట్టు ఎంపిక చేస్తామన్నారు. తొమ్మ‌ది విభాగాల్లో పోటీలు నిర్వ‌హించి అనంత‌రం అన్ని విభాగాల్లో ప్ర‌ధ‌మ స్థానంలో నిలిచిన విజేత‌ల‌కు ఫైన‌ల్ పోటీలు నిర్వ‌హించి ఓవ‌రాల్ ఛాంపియ‌న్ విజేతకు మిష్ట‌ర్ బాహుబ‌లి ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ టైటిల్‌తో పాటు 22 క్యారెట్ల స్వ‌చ్ఛ‌మైన మూడు గ్రాముల బంగారు ప‌త‌కాన్ని అంద‌జేస్తామ‌న్నారు.

ఎంపికైన రాష్ట్ర జట్టు వచ్చే నెలలో జరుగనున్న జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున పాల్గొంటుందని తెలిపారు. నగరానికి చెందిన జగ్లింగ్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్ పదేళ్లు పూర్తిచేసుకుంటున్న సంద‌ర్భంగా టోర్నమెంట్‌ను స్పాన్సర్ చేసి నిర్వహణకు ముందుకొచ్చినట్లు తెలిపారు.

పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ బిఆర్ అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివర్శిటీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెలగా జోషి, ఆత్మీయ‌, విశిష్ట అతిథులుగా రిటైర్డ్ తహసిల్దార్ సి.హెచ్.వెంకటేశ్వరరావు, సిద్ధార్ద అకాడమి ఆఫీసర్ టి.రమేష్ హాజ‌ర‌వుతార‌ని చెప్పారు.

పోస్టర్ ఆవిష్కరణలో జిగ్లింగ్ ఫిట్‌నెస్ వరల్డ్ అధినేత ఎం.శేఖర్, కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్.కె.ఖాద‌ర్, ఏపి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ దుర్గారావు, స్పూర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు