సిగరెట్ తాగుతా.. డ్రగ్స్ వాడను.. కావాలంటే గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ ఇస్తా అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన సినీ నటి ముమైత్ ఖాన్ సిట్ అధికారులనే విస్మయపరిచింది. డ్రగ్స్ దందాలో మీరూ పాత్రధారులని విచారణలో కెల్విన్ చెప్పాడని, డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎప్పట్నుంచి ఉందంటూ సిట్ మహిళాధికారులు ఎంత నొక్కి అడిగినా ముమైత్ ఒత్తిడికి గురికాకుండా తాను స్వేచ్చాజీవినే కాని డ్రగ్స్ మార్గం చేపట్టలేదని నొక్కి చెప్పింది. మూడేళ్లుగా తెలుగులో పెద్దగా సినిమాలు చేయని తనకు ఇక్కడ కెల్విన్ సరఫరా చేశాడంటున్న డ్రగ్స్‌తో లింకేమిటని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. కావాలంటే తన కాల్ డేటాలో ఉన్న నంబర్లు, తన ముంబై అడ్రస్, సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా విచారించుకోవచ్చని ముమైత్ తేల్చిచెప్పడంతో సిట్ అధికారిణులు ముఖాముఖాలు చూసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు సిట్ విచారణకు హాజరైన వారందరిలోకెల్లా బోల్డ్‌గా సమాధానాలివ్వడమే కాకుండా గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ కూడా ఇస్తానంటూ చెప్పిన ధీరనటి ముమైత్ మాత్రమే. అయితే ఆమె శాంపిల్స్ తీసుకునేందుకు అధికారులు నిరాకరించడం కొసమెరుపు.
బిగ్‌బాస్ టీవీ షో షూటింగ్‌లో ఉన్న ముమైత్ ఖాన్ గురువారం ఉదయం 10 గంటలకే నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జె.హరికృష్ణ నేతృత్వంలోని ముగ్గురు మహిళా అధికారుల బృందం ఆమెను 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 దాకా ఆరు గంటల పాటు విచారించింది. ‘‘సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కెల్విన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్టు మా వద్ద ఆధారాలున్నాయి. వారిద్దరి కాల్‌డేటాలో పదేపదే మీ ఫోన్ నంబర్ ఉందెందుకు పూరికి కెల్విన్ కాల్ చేసిన వెంటనే ఒకసారి కెల్విన్ నుంచి, మరోసారి పూరి నుంచి మీ ఫోన్‌కు కాల్స్ వచ్చినట్టు కాల్ డేటాలో స్పష్టంగా ఉంది. దీని వెనక కారణమేమిటి’’అంటూ ఆధారాలు ముందు పెట్టి సిట్ అధికారులు ప్రశ్నించారు.
‘‘నేను పూరి సినిమాల్లో ఎక్కువగా నటించా. కెల్విన్ ఈవెంట్ మేనేజర్ అవడం, సినీ పరిశ్రమలో బడా నిర్మాతలు, హీరోలు, దర్శకులతో పదేపదే కనిపించడం వల్ల నాకు పరిచయమయ్యాడంతే. ఈవెంట్ మేనేజ్‌మెంట్లు చేస్తుండటం వల్ల నాకు కాల్స్ చేస్తుండేవాడు. అంతకు మించి డ్రగ్స్ తీసుకోవడం వంటివి నాకు తెలియదు’’అని ముమైత్ బదులిచ్చినట్టు తెలుస్తోంది.
తెలుగు ఇండస్ట్రీతో తనకు దూరం పెరిగిందని, ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నానని ఆమె బదులిచ్చినట్టు తెలిసింది. మూడేళ్లుగా తెలుగులో పెద్దగా సినిమాలు చేయని తనకు ఇక్కడ కెల్విన్ సరఫరా చేశాడంటున్న డ్రగ్స్‌తో లింకేమిటని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. కావాలంటే తన కాల్ డేటాలో ఉన్న నంబర్లు, తన ముంబై అడ్రస్, సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా విచారించుకోవచ్చని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.
‘‘హైదరాబాద్‌లో ఉండగా మీరు పబ్బుల్లోనే ఎక్కువ గడిపేవారన్న వార్తలున్నాయి. ఆ సందర్భంగా డ్రగ్స్ అలవాటు చేసుకున్నారా’’అని ముమైత్‌ను సిట్ ప్రశ్నించింది. తాను పబ్బులకు వెళ్లడం నిజమేనన్న ఆమె, తనకు సిగరెట్ కాల్చే అలవాటుందని, డ్రగ్స్ తీసుకుంటానన్న ఆరోపణ మాత్రం సరైంది కాదని చెప్పారు. కావాలంటే పబ్బుల్లోని సీసీ కెమెరాలు పరిశీలించుకోవచ్చన్నారు.
పదేపదే గోవా, బ్యాంకాక్, విదేశాలు ఎందుకు వెళ్తారని ప్రశ్నించగా, తాను స్వేచ్చా జీవినని, విదేశీ పర్యటనలు, కొత్త ప్రాంతాలు చూడటం హాబీ అని ముమైత్ బదులిచ్చారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానాలుంటే తన రక్తనమూనాలతో పాటు గోర్లు, వెంట్రుకల శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్దమన్నారు. అయితే ఆమె శాంపిల్స్ తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు.