ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీలోనూ కీలక పగ్గాలు చేపట్టనున్నారు. జనసేన పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి.. దాని నాయకత్వ పగ్గాలను నాగబాబుకు ఇవ్వాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్ణయించారు. క్షేత్ర స్థాయి నాయకులను తాను కలవడానికి వీలు పడకపోవడంతో.... ఆ బాధ్యతను నాగబాబుకు అప్పగిస్తే బాగుంటుందని జనసేనాని భావిస్తున్నారు.
నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయం లేదని గుర్తించిన పవన్... ఈ సమస్యను నాగబాబు నిర్వహించగలరని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీచేసి మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. పార్టీకి అభిమానులు ఉన్న అది ఓట్ల రూపంలో కురువలేదని గ్రహించిన జనసేన అధినేత, ఈ సమన్వయ బాధ్యతలను సోదరుడికి అప్పగించాలని భావిస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే పలు కమిటీల చైర్మన్లను కూడా ప్రకటించారు. లోకల్‌బాడీ ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు, మైనారిటీల కమిటీ చైర్మన్‌గా విద్యావేత్త అర్హం ఖాన్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా అప్పికట్ల భరత్ భూషణ్‌ను నియమించారు. మహిళా సాధికారిత కమిటీ చైర్‌పర్సన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన రేఖాగౌడ్‌ను నియమించారు.