తిరుపతి బస్టాండ్‌లో పట్టపగలు ఓ యువతిపై నగరి మునిసిపల్ మాజీ కమిషనర్ దౌర్జన్యం చేశారు. కోర్కె తీర్చమని ఆర్నెల్లుగా పిలుస్తున్నా రావేంటే నీ.. య.. అంటూ రాయడానికి వీల్లేని భాషలో బూతులు లంఘించాడు. ఆ తర్వాత ఆ యువతిపై చేయి చేసుకున్నాడు. దీన్ని గమనించిన బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు అతన్ని పట్టుకుని చితకబాదారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ యువతి తిరుపతిలో తన తల్లితో కలిసి నివసిస్తోంది. ఈమె పుత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఈమెపై నగరి మునిసిపల్ మాజీ కమిషనర్ బాలాజీ యాదవ్ కన్నేశాడు. ఆర్నెల్లుగా ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు. అయినా అతని మాటలకు ఆ యువతి లొంగిపోలేదు.
ఈ క్రమంలో శనివారం డ్యూటీకి వెళ్లేందుకు బస్టాండుకు వచ్చింది. ఆ సమయంలో ఆమెను అడ్డుకున్న బాలాజీ యాదవ్, ఆర్నెల్లుగా అడుగుతున్నా, తన కోరిక తీర్చేందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. దీంతో ఆగ్రహించిన బాలాజీ ఆమెపై చేయిచేసుకున్నాడు.
ఈ ఘటనను చూస్తున్న యాత్రికులు, అతన్ని ప్రశ్నించగా, వారిపై తిరగబడ్డాడు. దీంతో అందరూ కలిసి అతన్ని కొట్టి తిరుపతి ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. 2015 వరకూ నగరి కమిషనర్‌గా ఉన్న బాలాజీ యాదవ్, ఆర్థిక అవకతవకలకు పాల్పడి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.