ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కొండారానికి చెందిన మారెడ్డి చెన్న కృష్ణారెడ్డి(58), భార్య పద్మజ(48) వనస్థలిపురంలోని బీడీఎల్ కాలనీ, రోడ్డు నంబరు 3లో నివాసం ఉంటున్నారు. గ్రామంలో వ్యవసాయం చేసే అతను ఆరేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. కుటుబంతోపాటు అక్కడే నివసిస్తున్నారు.
పద్మజ టైలరింగ్ పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి వివాహం జరిగింది. కృష్ణారెడ్డి కుటుంబంతో తరచూ గొడవపడుతుండేవాడు. రెండేళ్ల క్రితం భార్యతో గొడవపడి కొన్ని నెలలు ఇంటికి దూరంగా ఉన్నాడు. భార్య ఎవరితోనైనా మాట్లాడితే అనుమానంగా చూసేవాడు. సోమవారం అతని భార్య హైకోర్టుకాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లి వచ్చింది.
ఇంటికి వచ్చిన భార్యను అనుమానించాడు. తగువు పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వివాదం జరిగిన తర్వాత మాంసపు కత్తిని తీసుకుని ఆమెను ఎనిమిది చోట్ల పొడిచాడు. కుట్టుమిషన్‌పైన ఉన్న కత్తెరను తీసుకుని కూడా పొడిచాడు. తప్పించుకోవడానికి ఆమె రక్తపు గాయాలతోనే బయటకు పరుగుతీసి పక్కింట్లోకి వెళ్లింది. అక్కడకి కూడా వెళ్లి మళ్లీ పొడిచాడు. అదే కత్తితో తాను కూడా పొడుచుకున్నాడు. బాగా రక్తస్రావం అవడంతో ఇద్దరూ అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు బాధితులను ఉస్మానియా అసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.