శ్రీవారి సేవలో నారా భువనేశ్వరి... నారాపల్లెలో గామదేవతకు మొక్కులు

మంగళవారం, 24 అక్టోబరు 2023 (16:05 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 
 
ఈ సందర్భంగా భువనేశ్వరితో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. స్వామిని దర్శించుకున్న తర్వాత నారావారిపల్లెకు భువనేశ్వరి వెళ్లారు. నారావారిపల్లెలో పెద్దల సమాధుల వద్ద ఆమె పూజలు చేశారు. 
 
మరోవైపు 'నిజం గెలవాలి' పేరుతో ఆమె బుధవారం నుంచి మూడు రోజుల పాటు యాత్రను చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ప్రతి వారం మూడు రోజుల పాటు ఆమె ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. ఇందులోభాగంగా, బుధవారం చంద్రగిరిలో యాత్ర ప్రారంభంకానుంది.
 
మరోవైపు, తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం నారావారిపల్లెకు చేరుకున్నారు. అక్కడ తమ కులదేవతలైన గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్తమామలు ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారావారిపల్లిలో గ్రామస్తులు, మహిళలు భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్టుపై ఆవేదన వ్యక్తం చేసిన వారు... త్వరలో మంచి జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు.
 
నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి 'నిజం గెలవాలి' పేరుతో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో తీవ్ర వేదనకు గురై మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని టీడీపీ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు