మెడలు వంచుతామన్న మొనగాళ్లు పరదాల చాటున దాక్కొన్నారు... : నారా లోకేశ్

ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (10:59 IST)
తమకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామంటూ ప్రగల్భాలు పలికిన మొనగాళ్లు ఇపుడు పరదాల మాటున దాక్కొన్నారంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2020-21లో రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా మొండిచేయి చూపిన విషయం తెల్సిందే. దీనిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు.. ఏపీ విత్తమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు మరికొంతమంది మంత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపిందంటూ స్పందించారు.
 
దీనిపై నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. చేతకాని ప్రభుత్వానికి నిధులిచ్చినా ఏం ప్రయోజనమని కేంద్ర ప్రభుత్వం అనుకుందేమోనని, అందుకే, మన రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు ఇవ్వలేదని సెటైర్లు విసిరారు. 
 
వైసీపీ ఎనిమిది నెలల పాలనలో రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రాన్ని ఒక్కసారైనా అడిగారా? అని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచామని చెప్పుకోవడం కాదు, గెలిచి ఏం సాధించారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
 
"పనులన్నీ ఆపేసుకు కూర్చున్న చేతకాని ప్రభుత్వానికి నిధులిచ్చి ఏం లాభంలే అనుకున్నారేమో! అందుకే కేంద్రం ఏపీకి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. కేంద్రం మెడలు వంచేస్తాం అన్న మొనగాళ్ళు ఏ పరదాల చాటున చేతులు కట్టుకు నిల్చున్నారో! 
 
కేసుల భయంతో అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, ఇక్కడ మాత్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించారు అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. 8 నెలలలో ఒక్కసారైనా మా ఏపీకి ఇది ఇవ్వండి అని అడిగే సాహసం చేసారా? గెలిచాం అని చెప్పుకోవడం కాదు, గెలిచి ఏం సాధించారో చెప్పండి" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు