ట్విట్టర్‌లో మళ్లీ నారా లోకేష్... సీఎం జగన్ పైన ఇలా ట్వీటారు...

శనివారం, 20 జులై 2019 (15:13 IST)
జగన్ గారూ! ఎందులో ఆదర్శం అని చంద్రబాబు గారిని మీరు అడిగారంటే అది మీ అజ్ఞానమో, అమాయకత్వమో అర్థంకాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో దేశంలో మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి ఆదర్శంగా నిలిచారు చంద్రబాబుగారు. 
 
చంద్రబాబుగారి కష్టాన్నే మీ నాయనగారు ఉచిత విద్యుత్తు అంటూ సోకు చేసుకున్నారు. అంతేకాదు 2009 ఎన్నికలకి ముందు యూనిట్ విద్యుత్తును రూ.16కి కొనిపించి డిస్కంలకు రూ.6,600 బకాయి పెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత మీ నాయనగారిదే. 
 
విద్యుత్ సంస్థలకు మీ నాయన పెట్టిన కన్నాన్ని పూడ్చేందుకు 2015లో ఉదయ్ పథకాన్ని ఉపయోగించుకుని రూ.8,892 కోట్ల నష్టాలను సరిచేసే ప్రయత్నం చేసాం. 2015-16లో 4.63కు కొన్న విద్యుత్తును 2018-19లో 2.72కు కొంటున్నాం. ఇది చెప్పకుండా పాత ధరల మీదే రాద్ధాంతం ఎందుకు? 
 
అయినా విద్యుత్తును ఎక్కువ పెట్టి కొనేస్తున్నాం, ప్రజాధనం వృధా అయిపోతోంది అని సుద్దపూస కబుర్లు చెప్పే మీ సొంత సండూర్ పవర్ సంస్థ కర్ణాటకలో HESCOMకు 4.50కి ఎందుకు అమ్ముతుంది? అంటే మీ జేబులో వేసుకునేటప్పుడు అది ప్రజాధనం అని గుర్తుకురాదా?
 
థర్మల్ పవర్ చీప్ కదా ఎందుకు వాడుకోకూడదు అని వాదిస్తున్న మీ తెలివితేటలకు నవ్వొస్తోంది. ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ వైపు మళ్ళుతోందని, 2022 నాటికి 175 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పాదకతను దేశం లక్ష్యంగా పెట్టుకుందన్న విషయం మీకు తెలియకపోవడం మా దురదృష్టం అంటూ నారా లోకేష్ ట్వీటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు