అనిల్ కుమార్ యాదవ్‌ను చితక్కొట్టిన నరసారావు పేట ఓటర్లు!!

వరుణ్

గురువారం, 6 జూన్ 2024 (09:30 IST)
నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ఒక్క నియోజకవర్గంలో కూడా అతని కంటే వైకాపా అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అధికంగా ఓట్లు తెచ్చుకోలేక చతికిలపడ్డారు. లెక్కింపు మొదలైనప్పటి నుంచి లావుశ్రీకృష్ణదేవరాయలు హవా కొనసాగింది. పల్నాడు ఓటర్లు టీడీపీ అభ్యర్థి వైపు మొగ్గుచూపడంతో ఆయన 1,59,729 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 
 
2019లో నరసరావుపేట నుంచి వైకాపా ఎంపీగా ఎన్నికై ఐదేళ్లపాటు పల్నాడులో పలు అభివృద్ధి పనులు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నరసరావుపేట నుంచి రెండోసారి ఎంపీగా పోటీకి దిగారు. మిగిలిన నేతలకు భిన్నంగా ప్రత్యర్థులపై రాజకీయ ఆరోపణలు చేయకుండా ఐదేళ్లలో తాను ఏం చేశాను? గెలిపిస్తే చేసే అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. ప్రత్యర్థి అనిల్‌ యాదవ్‌ అనేక విమర్శలు చేసినా పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకెళ్లి ప్రజల మద్దతు పొందారు. 
 
నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. కొన్ని నియోజకవర్గాల్లో తెదేపా అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు కొంత ఓట్లు తగ్గాయి. దీంతో ఏడు అసెంబ్లీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే పార్లమెంటులో శ్రీకృష్ణదేవరాయలకు వచ్చి మెజారిటీ తగ్గింది. నరసరావుపేట నియోజకవర్గంలో అరవిందబాబుకు 1,03,167 ఓట్లు రాగా ఎంపీ అభ్యర్థికి 96148 ఓట్లు వచ్చాయి. అలాగే  వినుకొండలో జీవీ ఆంజనేయులకు 1,31,438 ఓట్లు రాగా లావుకు 1,23,856 ఓట్లు వచ్చాయి. ఇలా అన్ని నియోకవర్గాల్లోనూ అసెంబ్లీ అభ్యర్థులతో పోల్చితే ఎంపీ అభ్యర్థికి 1000 నుంచి 5వేల వరకు ఓట్లు తక్కువగా పడటంతో ఆ మేరకు మెజారిటీ తగ్గింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు