మీరిద్దరూ కలిసి పనిచేయాలని నా కోరిక, పెద్దవాడిని చెబుతున్నా, వినండి అని ఆయన రెండు రాష్ట్రాల స్పీకర్లకు హితబోధ చేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ‘ఎట్ హోం' అల్పాహార విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు శివప్రసాదరావు, మధుసూధనాచారి హాజరయ్యారు.
తిరిగి వెళ్ళే సమయంలో గవర్నర్ ఇద్దరి వద్దకు వచ్చి ఇద్దరి చేతులు పట్టుకొని మాట్లాడారు. అసెంబ్లీలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య భవనాలు, గదులు, క్వార్టర్లు పంచుకోవడంపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలను ఈ విషయంలో పెద్దరికం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. ‘తెలంగాణ స్పీకరూ, మీరూ పాత పరిచయస్తులే. కలిసి పనిచేసినవారే. మీరు అనుభవజ్ఞులు. పెద్ద మనిషిగా బాధ్యత తీసుకొని ఏమైనా సమస్యలు ఉంటే చర్చించుకొని పరిష్కరించుకోండి. మీమీద నాకు నమ్మకం ఉంది' అని నరసింహన్ అన్నారు.