ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం..కేంద్రం

మంగళవారం, 23 మార్చి 2021 (15:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక హోదా అమలు కాని విషయం తెలిసిందే. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. అందుకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేసింది. ఏపీలోని గత చంద్రబాబు సర్కార్ సైతం ఇందుకు అంగీకరించింది. 
 
అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మాత్రం ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని.. దీనిపై ఎప్పటికప్పుడు తాము డిమాండ్ చేస్తూనే ఉంటామని ప్రకటించింది. ఇదే విషయాన్ని పలువురు వైసీపీ నేతలు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు.
 
అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం వైఖరి మారుతోందని.. ఈ విషయంలో వైసీపీ సర్కార్ కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తోందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్ వేదికగా మరోసారి కుండబద్ధలు కొట్టింది కేంద్రం. 
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‍నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‍రాయ్ సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
 
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య అసంపూర్తిగా ఉన్న సమస్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయన్న కేంద్రమంత్రి.. పరిష్కారం మాత్రం తమ చేతుల్లో లేదన్నారు. 
 
ఇరు తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యయమని గతంలోనే స్పష్టం చేసిన కేంద్రం.. ఇదే విషయాన్ని మరోసారి తేల్చిచెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు