ఉగ్రరూపం దాల్చిన పెన్నానది... ఎగువ ప్రాంతాల్లో కుంభవృష్టి

శుక్రవారం, 27 నవంబరు 2020 (20:20 IST)
తమిళనాడు - పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య ఉన్న మరక్కాణం ప్రాంతంలో తీరందాటిన తర్వాత నివర్ తుఫాను చూపించిన ప్రభావం అంతాఇంతా కాదు. ముఖ్యంగా, ఇది తమిళనాడు కంటే ఈ రాష్ట్రానికి అత్యంత సమీపంలో ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పెను విధ్వంసమే సృష్టించింది. బంగాళాఖాతంలో బాగా బలపడిన తర్వాత తీరం దాటింది. 
 
ఈ కారణంగా తీవ్రందాటి భూభాకంపైకి ప్రవేశించిన తర్వాత కూడా నివర్ తుఫాను ప్రభావం కొన్ని గంటల పాటు కొనసాగించింది. ఫలితంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ముఖ్యంగా, నెల్లూరులో అతి భారీ వర్షం కురిసింది. అలాగే, ఎగువ ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం కొనసాగడంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. 
 
ఇప్పటికీ పెన్నా నదికి భారీ వరద వస్తుండటంతో అధికారులు పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పెన్నా నదికి వరద పోటెత్తుతోందని, పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని హెచ్చరించారు. 
 
ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల శాఖ స్పష్టంచేసింది. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, వరద నీటిలో పశువులు, గొర్రెలు, మేకలు వదలడం వంటివి చేయరాదని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు. 
 
కాగా, పైనుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తుండటంతో పలు చోట్ల పెన్నా నదికి కట్టలు తెగిపోయాయి. సమీప గ్రామాల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పెన్నా నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు