ఇటీవల మరికొన్ని క్షణాల్లో పెళ్ళి చేసుకోవాల్సిన వధువును ఆమె బంధువులు వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్లారు. నిజామాబాద్ ఆర్య సమాజ్‌లో పెళ్లికి సిద్ధపడగా, వధువును తీసుకెళ్లారు. ప్రేమ పెళ్లికి అంగీకరించని అమ్మాయి బంధువులు ఆమెను బలవంతంగా కొట్టుకుంటూ ఎత్తుకెళ్లారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ కథ సుఖాంతమైంది.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్య, రెంజల్ మండలం వీరన్న గుట్టకు చెందిన ప్రదీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. నిజామాబాద్‌లో డిగ్రీ చదివిన రోజుల్లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం ప్రణదీప్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు.
దీంతో నగరంలోని ఆర్య సమాజ్‌లో బుధవారం మధ్యాహ్నం పెళ్లికి సిద్ధమవుతుండగా పెళ్లి కూతురు బంధువులు వచ్చి నానా హంగామా సృష్టించారు. సౌజన్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా ఆమెను ఎత్తుకుని బైక్‌పై తీసుకెళ్లారు. ఈ ఘటనపై ప్రణదీప్ రెండో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దీంతో నిజామాబాద్ ఏసీబీ సుదర్శన నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందం అమ్మాయి కోసం తీవ్రంగా గాలించింది. చివరకు స్వగ్రామంలో సౌజన్యను గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులతో మాట్లాడి అమ్మాయిని నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చారు. అబ్బాయితోనే ఉంటానని, అతన్నే పెళ్లి చేసుకుంటానంటూ మెజిస్ట్రేట్ ముందు సౌజన్య తన వాంగ్మూలాన్ని వినిపించింది.
ఇరువురూ మేజర్లు కావడంతో పాటు, అమ్మాయి ఇష్టప్రకారం ఇరువురికి పెళ్లి చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆ ప్రేమ జంటను పెళ్లితో ఒక్కటి చేసింది. పోలీస్‌స్టేషన్‌లోనే సౌజన్య మెడలో ప్రదీప్ తాళికట్టాడు. దీంతో ఈ ప్రేమ కథ సుఖాంతమైంది.