మహిళలకు గుడ్ న్యూస్.. వైఎస్సార్ పెన్షన్ కానుక.. దరఖాస్తుకు 5 రోజులు పొడిగింపు

శనివారం, 18 జులై 2020 (08:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.. ఓవైపు కరోనా నియంత్రణ చేస్తూనే.. మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారు. మహిళలకు జీవనోపాధి మార్గాలను కల్పించడం, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం ద్వారా వారి జీవనప్రమాణాలు మెరుగుపరిచేందుకు ''వైఎస్సార్‌ చేయూత''ద్వారా ఆదుకుంటామని గత ఎన్నికల ప్రణాళికలో వైఎస్‌.జగన్‌ హామీ ఇచ్చారు. 
 
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు 45 ఏళ్లనుంచి 60ఏళ్లలోపు ఉన్నవారందరికీ కూడా ఈ పథకం కింద అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75వేలు వారి చేతిలో పెట్టనున్నట్టు ప్రకటించారు. ఈ హామీకి కట్టుబడి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జూన్‌ 28 నుంచి లబ్ధిదారులనుంచి దరఖాస్తులను తీసుకుంటోంది.
 
తాజాగా ఈ పథకం ద్వారా ఏపీలో మహిళలకు మరో గుడ్ న్యూస్ వచ్చి చేరింది. వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి దరఖాస్తు చేసేందుకు మరో ఐదు రోజులు గడువు పెంచుతున్నట్లు ప్రకటించారు.
 
పింఛన్‌దారులకూ చేయూత పథకంలో సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించడంతో దరఖాస్తు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉండి ఇప్పటి వరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు