ఆమె విభిన్న ప్రతిభావంతురాలు. వృత్తి నిబద్ధతకు అది అడ్డుకాలేదు. సగటు మనిషిని మించి తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించటం ద్వారా నేరుగా కేంద్ర ప్రభుత్వ మహిళాభివృద్ది, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త సకిరాబాయి పనితీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
కరోనా కష్టకాలంలో, లాక్‌డౌన్ వేళ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరించి కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు సకిరాబాయి. తన వికలాంగతను లెక్కచేయకుండా మూడు చక్రాల సైకిల్ పైన చిన్నారులు, గర్భీణిలు, బాలింతలకు పౌష్టికాహారం సరఫరా చేసిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. భిన్నమైన సామర్థ్యం గల గుంటూరు జిల్లా ఈపూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని బొల్లాపల్లికి చెందిన సాకిరాబాయి చాలా కాలంగా అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు.
పని విషయంలో ఎటువంటి అశ్రద్ధను చూపని ఆమె, లాక్ డౌన్ సమయంలోనూ తన నిబద్ధతను చూపారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రాష్ట్రానికి చెందిన అంగన్ వాడీ కార్యకర్తలు మూడు విడతలుగా లబ్ధిదారుల నివాస గృహాల ముంగిట పౌష్టికాహార పంపిణీని ఇప్పటికే పూర్తి చేశారు. కందిపప్పు, బియ్యం, నూనె, బాలామృతం, గుడ్లు, పాలు ఇలా పలు రకాల పౌష్టికాహారాలను పంపిణీ చేసే క్రమంలో సకిరాబాయి ఆదర్శవంతమైన పనితీరును ప్రదర్శించారు.
తాను చక్రాల కుర్చీకే పరిమితం అయినప్పటికీ లబ్దిదారులు ఎవ్వరూ ఇబ్బంది పడరాదన్న ఆలోచన మేరకు తన మూడు చక్రాల బండినే రవాణా వాహనంగా మార్చి తనతో పాటు వాటిని గృహస్తుల చెంతకు తీసుకువెళ్లి పంపిణీ పూర్తి చేసారు. ఈ క్రమంలో రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ తన పనితీరుతో సకిరాబాయి జాతీయ స్థాయిలో ప్రశంశలు అందుకోవటం ముదావహమన్నారు.
ఆమెకు తగిన ప్రోత్సాహం అందిస్తామని వివరించారు. పోషకాహారాన్ని ఇంటి వద్దకే చేర్చే కార్యక్రమంలో 6 నెలల నుండి 6 సంవత్సరాల వయస్సు గల 22 లక్షల చిన్నారులు, 6.2 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు లబ్ది పొందారని కృతికా శుక్లా వివరించారు.