కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన మానస ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకుంది. మానసకు ఈ దుస్థితి ఎందుకు కలిగింది?. మైలవరానికి చెందిన మానసకు ఆరు నెలల క్రితం అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రభాకర్‌తో పెళ్ళయింది. ఎన్నారై సంబంధం అని పెద్దలు ఆమెను ప్రభాకర్‌కు కట్టబెట్టారు. వారిద్దరూ కాపురానికి అమెరికా వెళ్ళారు. కానీ, అక్కడికి వెళ్ళినప్పటికీ... మానస మనసు ఇండియాలో ఉన్న హేమంత్ పైనే ఉంది. హేమంత్‌ని పెళ్ళికి ముందే మానస ప్రేమించింది. అయినా అమెరికా సంబంధం అంటూ తల్లితండ్రులు ఆమెను ప్రభాకర్‌కిచ్చి పెళ్ళి చేశారు.
మానస హేమంత్‌కు అమెరికా నుంచే ఫోన్లో టచ్‌లో ఉంది. తాను అమెరికాలో ఉండలేనని మానస చెప్పింది. అమెరికా నుంచి వచ్చేయ్ అని హేమంత్ చెప్పాడు. ఆమె ఏం ఆలోచించకుండా విజయవాడకు వచ్చేసింది. ఇక్కడి ఎన్నో ఆశలతో వస్తే, ఊహించిన షాక్ తగిలింది. హేమంత్ ఫోన్ ఎత్తడం మానేశాడు. అసలు కలవనే కలవలేదు. దీనితో విధి లేక మానస పుట్టింటికి వెళ్లగా, ఇంట్లో వాళ్ళు ఆమెను చీదరించుకున్నారు. ఇంట్లోకి రావొద్దన్నారు. మానసిక క్షోభతో వారం నుంచి తెలిసిన వాళ్ళింట్లో తలదాచుకుంటోంది.
ఎంతకాలమిలా అనుకుని చివరకి ఆత్మహత్యా యత్నం చేసింది... ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. మానస ఆత్మహత్యా యత్నం వార్త టీవీల ద్వారా తెలుసుకుని హేమంత్ ఇపుడు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. మానసను పరామర్శించాడు. కానీ మానసను హేమంత్ పెళ్ళి చేసుకుంటాడా అనేది ప్రశ్నగా మిగిలింది. కాగా ప్రియుడిని వైసీపీ నేత జోగి రమేష్ వెంట తోడ్కొని వచ్చారు. మరి పెళ్లి మాటేమిటి...? అమెరికాలో ఉన్న మానస భర్త పరిస్థితి ఏమిటి...? ఈ లవ్ స్టోరీ కంక్లూజన్ ఏంటి..? అనేది తేలాల్సి ఉంది.