టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టిఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ప్రముఖ పారిశ్రామికవేత్తగాను, మీడియా ఛానల్ అధిపతిగాను వున్నారు. నార్నే శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీపై గత ఎన్నికలకు ముందే వార్తలొచ్చాయి. రాజకీయంగా 2009 ఎన్నికల్లో ఫుల్‌గా సపోర్ట్ చేసిన ఆయన ఆ తరువాత తన అల్లుడు ఎన్‌టిఆర్‌కు చంద్రబాబు, బాలయ్యలతో గ్యాప్ రావడంతో టిడిపితో అంటీముట్టనట్లు వ్యవహరించారు. గత ఎన్నికల్లో శ్రీనివాస్ వైసిపిలో చేరి క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక సీటు నుంచి ఎంపిగా, లేక పెనుములూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చినా, ఆ తరువాత ఆయన సైలెంట్ అయ్యారు.
ఐతే తాజాగా నార్నే శ్రీనివాస్ వైసిపిలో చేరుతారంటూ మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. ఈయనది గుంటూరు జిల్లానే. ఈ నేపథ్యంలో ఆయన వైసిపి నుంచి గుంటూరు జిల్లాలోని చిలకూరిపేట నుంచి పోటీ చేస్తారనేది టాక్. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వైసిపి ఇన్‌ఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఉన్నారు. 2004లో రాజశేఖర్ గెలిచినా, 2009, 2014ఎన్నికల్లో ఓడిపోయారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతిలోను ఈయన ఓడిపోయారు.
అయితే రాజశేఖర్ మామ మాజీ ఎమ్మెల్యే సాంబయ్యకు గ్రామాల్లో ఎప్పటి నుంచో మంచి పట్టు ఉంది. అయితే ఇంత సపోర్టు ఉన్నా రాజశేఖర్‌కు అనారోగ్యం కారణంగా గత కొన్నినెలల నుంచి అక్కడ సరైన నాయకుడు వైసిపికి లేడనేది టాక్. ఇదంతా నార్నే శ్రీనివాసరావుకు బాగా కలిసొస్తోంది. ఆర్థికంగా ఖర్చు పెట్టుకోగలడు.. పార్టీకి బాగా ఉపయోగపడగలడు కాబట్టి నార్నేకు ఈ సీటు ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లేనని చెప్పుకుంటున్నారు.