అమ్మకానికి ఓ అబ్బాయి... రూ.70 వేలకు బేరం

బుధవారం, 5 ఆగస్టు 2015 (11:14 IST)
పసిగుడ్డు.. అతని తల్లిదండ్రులు ఎవరో కూడా తెలుసుకోలేని స్థితి... కానీ ఆ బాబు తల్లికి భారమయ్యాడు. వ్యాపార వస్తువు కూడా అయ్యాడు. తన బిడ్డను అమ్మేసి బతికేయాలనుకున్న తల్లికి వ్యాపార వస్తువులా ఉపయోగపడ్డాడు. కన్నతల్లి నుంచి కొన్న తల్లి చేతుల్లోకి వెళ్ళిపోయాడు. చివరకు ఐసీడీఎస్ అధికారుల ఒడికి చేరాడు. నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
నెల్లూరు జిల్లా కారుమంచివారికండ్రిగకు చెందిన తీపలపూడి బాబయ్య, కృష్ణమ్మ దంపతుల ఒక్క కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో వారు ఈ నెల 2న ఎక్కడి నుంచో గ్రామానికి తీసుకొచ్చినట్లుగా అధికారులకు సమాచారం అందింది. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ ప్రమీలారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్, పోలీసుల కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు.
 
బాలుని తల్లి చిత్తూరు జిల్లాకు చెందిన జూలేఖాగా గుర్తించారు. ఈమె నాయుడుపేటలోని తమ బంధువుల ద్వారా బాలుడ్ని విక్రయించినట్లు నిర్ధారించారు. బాలుని విక్రయ విషయంలో పట్టణానికి చెందిన ముంతాజ్,ఓ ప్రైవేటు వైద్యశాలలో పని చేసే లక్ష్మీకాంతమ్మ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. బాలుడ్ని బాబయ్య దంపతులు రూ.70 వేలకుపైగా నగదు ఇచ్చి కొనుగోలు చేసినట్లుగా వెల్లడైంది. 
 
పట్టణంలోని ముంతాజ్ స్వగృహానికి పోలీసులు వెళ్లగా అప్పటికే ఆమె పరారయ్యారు. సీడీపీఓ ప్రమీలారాణి ఫిర్యాదు మేరకు బాబయ్య, కృష్ణమ్మ దంపతులు, బాలుని తల్లి జూలేఖాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడ్ని నెల్లూరులోని ప్రభుత్వ శిశువిహార్‌కు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి