వెంకయ్య నిజంగా అజాత శత్రువే.. పవర్ స్టారూ, జగనూ కూడా సమర్థించారు

మంగళవారం, 18 జులై 2017 (04:26 IST)
రాష్ట్రపతి పదవికి ఎంపికకు కంటే ఉపరాష్ట్రపతి పదవి ఎంపిక సులభంగా కనిపిస్తోంది. కారణం ఆ పదవికి తెలుగు ప్రముఖుడైన వెంకయ్యనాయుడిని అభ్యర్థిగా ఎన్డీఎ నిలపడమే. ఆ మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా ట్వీటర్లో వెంకయ్యకు సపోర్టుతో మారుమోగిపోయింది. ప్రధాని నుంచి సాధారణ కార్యకర్తదాగా వెంకయ్య అభ్యర్థిత్వం పట్ల తమ సంతోషం వ్యక్తపరుస్తూ ట్వీట్లు చేశారు. ఇక తెలుగురాష్ట్రాల్లో ప్రతి ప్రముఖుడూ పార్టీ భేదాలు మరిచి వెంకయ్య అభ్యర్థిత్వం పట్ల హర్షం ప్రకటిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి వైకాపా అధినేత జగన్ వరకు వెంకయ్యనాయుడికి మద్దతు, అభినందలను తెలియజేయడం విశేషం.
 
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడును ఎంపిక చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన శ్రేణుల తరపున ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. సీనియర్ రాజకీయ నాయకునిగా అపార అనుభవమున్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్ర పదవికి వన్నె తెస్తారని బలంగా విశ్వసిస్తున్నానని చెప్పారు. ఇది తెలుగు వారందరూ గర్వించదగిన పరిణామంగా, తెలుగు వారికి దక్కిన గౌరవంగా తాను భావిస్తున్నానని పవన్ చెప్పారు. వెంకయ్య నాయుడును ఎంపిక చేసిన బి.జె.పి. అధినాయకత్వానికి అభినందనలు తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
 
అమిత్ షా ఫోన్. చేశాడు. వెంకయ్యకు జగన్ ఊ... అన్నాడు 
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్యనాయుడుకు మద్దతివ్వాలని కోరారు. దీనికి స్పందించిన జగన్ వెంకయ్యకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. రాజ్యాంగ పదవుల్లో రాజకీయాలు తగవని వైసీపీ భావిస్తోందని జగన్ చెప్పినట్లు సమాచారం.
 
ట్వీటర్‌లో పోటెత్తిన శుభాకాంక్షలు
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడుకి ట్వీటర్‌లో శుభాకాంక్షలు పోటెత్తుతున్నాయి. చాలా ఏళ్లుగా వెంకయ్యనాయుడు తనకు తెలుసని, ఆయన ఉప రాష్ట్రపతి పదవికి సరైన అభ్యర్థని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీటర్‌లో పోస్టు చేశారు. వెంకయ్య అనుభవం క్రీయాశీలకం కానుందని అన్నారు. పాతికేళ్ల రాజకీయ అనుభవానికి పట్టమిదీ అని రాజస్ధాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ట్వీట్‌ చేశారు. రైతు బిడ్డకు దక్కిన గౌరవమిది అని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెంకయ్యను అభినందిస్తూ ట్వీటారు. వెంకయ్యకున్న నాయకత్వ లక్షణాలే ఆయన్ను ఉప రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవికి దగ్గర చేశాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ ట్వీట్‌ చేశారు.
 

వెబ్దునియా పై చదవండి